సేవచేయడానికే అధికారం.. ఎన్టీఆర్ భావితరాలకు దిక్సూచి..
posted on May 28, 2021 @ 11:00AM
ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి, వారసత్వమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు. తెలుగుజాతి యుగపురుషుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చంద్రబాబు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నివాళులర్పించారు.
సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిపోతుందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవితం ఈ తరానికే కాకుండా భావితరాలకూ దిక్సూచి అని అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించేవరకు రాజీ పడకుండా ముందుకెళ్లిన వ్యక్తి ఆయన అని కొనియాడారు.
సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా మారారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అవసరమైన పథకాలు రూపొందించారని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లు తదితర ఎన్నో పథకాలను దూరదృష్టితో ఆలోచించి తీసుకొచ్చారన్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ ఉదయం చంద్రబాబు ట్వీట్ చేశారు. అధికారం అనుభవించడానికి కాదు.. ప్రజలకు సేవచేయడానికి అనే మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి, పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలు, ఆశయాలను మననం చేసుకుంటూ.. ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదామని..తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దామని ట్వీట్ చేశారు.
అటు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడు, పేదల పెన్నిదని కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. ఎన్టీఆర్‌పై ఎంతో మంది పుస్తకాలు రాశారని.. అయితే ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకురావాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ తాను అదే డిమాండ్ చేస్తున్నానన్నారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా తాము ఈ ఏడాది ఘాట్ వద్దకు వెళ్లలేకపోతున్నామని ఎన్టీఆర్ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ తెలిపారు. ఇంటి వద్దే తండ్రి ఆశీర్వాదం తీసుకుంటున్నామని చెప్పారు.