హే హనుమా.. ఈ గొడవేంటి గోవిందా..
posted on May 28, 2021 @ 3:30PM
హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? తిరుమల గిరుల్లోనా? కర్ణాటకలోని కిష్కింధలోనా? అనేదానిపై ఏళ్లుగా వివాదం చెలరేగుతూనే ఉంది. విస్తృత పరిశోధనలు, పరిశీలనల అనంతరం.. ఆ రామభక్తుడు తిరుమల గిరుల్లోనే జన్మించాడంటూ టీటీడీ ఇటీవల ప్రకటించింది. కాదు కాదు.. అంజనీపుత్రుని పుట్టుక కర్ణాటకలోని కిష్కింధలోనే అంటూ అక్కడి సంస్థాన్ వాదిస్తోంది. అందుకే, హనుమ జన్మస్థలంపై క్లారిటీ కోసం తాజాగా ఇరుపక్షాలు సమావేశమై చర్చించాయి. అందులోనూ, ఎలాంటి ఏకాభిప్రాయం రాకుండా చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. చర్చలైతే ముగిసాయి కానీ.. రచ్చ మాత్రం ఆగలేదు. టీటీడీపై గోవిందానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. వాటిని తప్పుబడుతూ.. తిరిగి కౌంటర్ ఇచ్చారు టీటీడీ పండితులు.
తాజాగా, టీటీడీపై గోవిందానంద సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులేనని తోచిపుచ్చారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా హనుమంతుడి జన్మస్థలాన్ని అసంపూర్ణ జ్ఞానంతో ప్రకటించారని తప్పుబట్టారు. టీటీడీ ప్రమాణంగా చూపిస్తున్న.. వెంకటాచలం మహత్యం సంకలనం తప్పుల తడక అని కొట్టిపారేశారు. వెంకటాచలం మహత్యం బుర్రలేని వారు రాశారని మండిపడ్డారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద విమర్శించారు. హనుమంతుడు పుట్టిన శ్లోకంతో తిధికి సంబంధం లేదన్నారు.
కలియుగంలో హనుమంతుడు పుట్టినట్టు టీటీడీ పుస్తకం చెబుతోందని, టీటీడీ ప్రకారం హనుమంతుడు రాక్షసుడు.. రామాయణం ప్రకారం అప్సరస బిడ్డ అని తెలిపారు. అంజన హళ్లి ఇంకా పంపా సరోవరం దగ్గర ఉందని తెలిపారు. రామాయణంలో ఎక్కడా.. తిరుమల గురించి కానీ, వృషాద్రి, శేషాద్రి పర్వతాల గురించి కానీ లేదని చెప్పారు. కొందరు కీర్తి కోసం ఒత్తిడితో హనుమంతుడి జన్మస్థలం తిరుమల కొండలేనంటూ పండితుల చేత ప్రకటన చేయించారని ఆరోపించారు. టీటీడీ పండితులు దారి తప్పారని, తిరుమలను హనుమంతుడి జన్మస్థలం అని ప్రకటించాక.. టీటీడీకి లాయర్ నోటీసులు వెళ్లాయని గోవిందానంద తెలిపారు.