పొలంలో 3 కోట్ల వజ్రం.. రైతే రాజు.. మట్టిలో మాణిక్యాలు..
posted on May 28, 2021 @ 1:31PM
రోజూలానే ఆ రైతు పొలానికి వెళ్లాడు. పొలం పనుల్లో బిజీగా ఉన్నాడు. నేలపై ఓ రాయి తళుక్కున మెరుస్తూ కనిపించింది. ఆ రైతుకు అనుమానం వచ్చింది. ఆ రాయిని జేబులో వేసుకొని.. ఓ వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. పొలంలో దొరికిన తెల్లని రాయిని అతనికి చూపించాడు. ఎంతిస్తావ్ అని అడిగాడు? వ్యాపారి నుంచి కోటి 20 లక్షలు తీసుకొని సైలెంట్‌గా వెళ్లిపోయాడు ఆ రైతు. అయితే, ఆ రైతు తెచ్చిన రాయి విలువ 3 కోట్లు ఉంటుందని ఆ వ్యాపారికి మాత్రమే తెలుసు. రైతుకు తెలీదు. ఒక్క రోజులోనే కోటీశ్వరుడైన ఆ రైతు ఇప్పుడు కర్నూలు జిల్లాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆ రాయి మహత్యం అలాంటిది మరి. అది మట్టిలో మాణిక్యం. ధగధగమెరిసే పే..ద్ద సైజు వజ్రం.
అందరికి అన్నం పెట్టె రైతన్నకు.. పట్టెడు అన్నం దొరకక ఇబ్బందులు. ఓవైపు అప్పుల బాధ.. మరోవైపు దొరకని గిట్టుబాటు ధర. ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. అయితే, ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన రైతుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంకు చెందిన రైతు పంట పండింది. ఏకంగా మూడు కోట్లు విలువ చేసే వజ్రం సాగు భూమిలో దొరికింది. రహస్యంగా వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లగా.. అది ఏకంగా 30 క్యారెట్ల బరువున్న పెద్ద సైజు మేలిమి వజ్రమని తేలింది. రైతుతో బేరసారాలు ఆడి.. కోటి 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్కెట్లో దీని ధర రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ఆ నేలే అలాంటిది. ఆ ప్రాంతం వజ్రాల గని. వర్షాలు పడితే చాలు.. ఆ మట్టిలో వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన విలువైన వజ్రాలు.. వర్షం దాటికి పై పొరల నుండి బయట పడతాయి. అందుకే, అక్కడ వజ్రాలను వెతకటానికి వేరే ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున జనాలు అక్కడికి వస్తుంటారు. జొన్నగిరి ప్రాంత చుట్టుపక్క గ్రామాల రైతులు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉదయం నుండి వజ్రాల వేట కొనసాగిస్తారు. దొరికిన వారు లక్షాధికారి.. దొరకని వారి ప్రయత్నం మరోసారి..
తాజాగా, తన పొలంలో వెతుకుతున్న రైతుకు కోట్ల విలువ చేసే విజ్రం దొరికింది. పొలంలో మిలమిలా మెరుస్తున్న రాయి తనని బాగా ఆకర్షించింది. వజ్రంగా భావించి వెంటనే ఇంటికి తీసుకువచ్చాడు. స్థానిక వజ్రాల వ్యాపారి పార్థుకు చూపించగా.. అతను ఆ వజ్రాన్ని పరీక్షించాడు. అంతే, ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ప్రపంచ మార్కెట్లో భారీ డిమాండ్ ఉండే.. పెద్ద సైజు ఉన్న.. 30 క్యారెట్ల వజ్రం కావడంతో వెంటనే బేరం మాట్లాడేశాడు. ఆ వజ్రానికి కోటి 20 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.
30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం మార్కెట్ ధర రూ.3 కోట్ల వరకు ఉంటుందని ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్నారు. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు చెప్పలేదని.. వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసారు. చివరకు ఆ నోటా ఈ నోటా పడి బయటపడ్డ విలువైన వజ్రం విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
సాధారణంగా ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికితే.. స్థానిక వ్యాపారులందరికీ సమాచారమిచ్చి వేలం పాటలో అమ్ముతారు. కాని తొలకరికి ముందే, అదీ.. ఇంత విలువైన వజ్రం దొరకడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కోట్లు విలువ చేసే విలువైన వజ్రాలను అక్కడి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత భారీ మొత్తంలో వజ్రాలు దొరికినా.. రెవెన్యూ అధికారులు ఆ దరిదాపులకి కూడా వెళ్లకపోవడం అక్కడ సాధారణ విషయమే.