'నో వ్యాక్సినేషన్- నో శాలరీ'.. కలెక్టర్ కొత్త రూల్..
posted on Jun 2, 2021 @ 3:10PM
వ్యాక్సిన్‌పై ఇప్పటికీ అనేక మందిలో అపోహలు ఉన్నాయి. అందుకే, చాలామంది టీకా తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. కొందరు వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడం లేదు. సెకండ్ వేవ్‌లో భారీగా కేసులు వస్తుండటం.. త్వరలో మూడో ముప్పు పొంచి ఉందనే వార్తలతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. త్వరగా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. టీకా కొరతను తీర్చడానికి ఇప్పటికే విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు సరళం చేశారు. ఈ ఏడాది చివరికల్లా అందరికీ టీకా లక్ష్యం నెరవేరేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి టీకానే ప్రధాన ఆయుధం.
ప్రముఖులు వేసుకుంటేనే ప్రజలకు స్పూర్తి. అధికారులు ముందుగా టీకా తీసుకుంటేనే సామాన్యులకు ధైర్యం. అందుకే, టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టీకాలు తీసుకోకపోతే జీతాలు పొందలేరని జిల్లా ఉన్నతాధికారి హెచ్చరించారు. ‘నో వ్యాక్సినేషన్.. నో సాలరీ’ అంటూ ఫిరోజాబాద్ జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని జిల్లా చీఫ్ డెవలప్‌మెంట్ అధికారి చర్చిత్ గౌర్ చెప్పారు.
‘ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కొవిడ్ టీకా తీసుకోకపోతే.. సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. మే నెల జీతాన్ని నిలిపివేస్తుంది’ అని వెల్లడించారు. జిల్లా ట్రెజరీ అధికారులకు, ఆయా విభాగాధిపతులకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపినట్లు ఆయన తెలిపారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆదేశించారు.
నిబంధన కాస్త కఠినంగా అనిపించినా.. టీకాలు తీసుకుంటేనే జీతాలు.. అనే కాన్సెప్ట్ బాగుందంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవాలని చూస్తే ఎలా అని.. అందుకే కలెక్టర్ పెట్టిన అనధికార రూల్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.