అమరవీరులకు నివాళులు.. నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు..
posted on Jun 2, 2021 @ 10:41AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరుగుతున్నాయి. గన్‌పార్క్ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం, ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఎగరవేశారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రం సహజ వనరులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను కలిగి ఉందని కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి, స్వయం సమృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో తన వంతు పాత్రను రాష్ట్రం కొనసాగించాలని ఆకాంక్షించారు వెంకయ్యనాయుడు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రజల కృషితో కరోనా నుంచి త్వరలో బయటపడతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.