మోదీకంటే జగన్ బిజీనా? పరీక్షలపై పంతమేల? ప్రాణాలతో చెలగాటమేల?
posted on Jun 2, 2021 @ 1:06PM
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ ఇంకా మొండి వైఖరి వీడటం లేదు. కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని మోడీ అంటే.. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టైనా సరే.. పరీక్షలు నిర్వహించి తీరుతామనే మూర్ఖత్వంతో జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 'రాజీ పడలేం.. పరీక్షల కోసం విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేం' అని మోదీ ప్రకటిస్తే.. సీఎం జగన్‌రెడ్డి మాత్రం.. 'రాజీ పడతాం.. పరీక్షల కోసం విద్యార్థులను ప్రమాదంలోకి నెడతాం'.. అన్నట్టు పట్టుబడుతున్నారని మండిపడుతున్నారు.
ప్రధాని మోదీ. దేశంలోకే బిజీ పర్సన్. నిత్యం సమీక్షలు, సమావేశాలు. క్షణం తీరిక ఉండదు దేశ ప్రధానమంత్రికి. అంత బిజీ షెడ్యూల్‌లోనూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్‌లతో పాటు పాఠశాల, ఉన్నత విద్య సెక్రటరీ, పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలు, ఇతర పక్షాలతో చర్చించిన మీదట.. ప్రభుత్వం ముందున్న అన్ని అవకాశాలను పరిశీలించి 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని యావత్ దేశం స్వాగతించింది. ఒక్క ఏపీ సర్కారు మినహా.
ఏపీ విద్యార్థులంతా పరీక్షలు వద్దంటున్నారు. స్టూడెంట్స్ తల్లిదండ్రులు సైతం ఎగ్జామ్స్ వద్దంటూ వేడుకుంటున్నారు. పరీక్షలు కావాల్సిందేనంటూ పట్టుబడుతుంది ఒకే ఒక్కరు. కేవలం ఏపీ సర్కారు మాత్రమే పరీక్షల కోసం పట్టుబడుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన దేశంలోకే పేరెన్నిక గల హేమాహేమీల్లాంటి వ్యక్తులు అంతసేపు సమావేశమై.. పరీక్షల సాధ్యాసాధ్యాలపై క్షుణ్ణంగా చర్చించి మరీ సీబీఎస్ఈ 12వ తరగతి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. దేశంలోకే అత్యున్నత వ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయినా కనీసం సీఎం జగన్‌రెడ్డి గౌరవించలేరా? పది, ఇంటర్ పరీక్షలను ఇప్పటికైనా రద్దు చేయలేరా? ఎందుకంత మంకుపట్టు? ఎందుకలా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం? ఎందుకంత పంతం? ఓహో.. లోకేశ్‌కు క్రెడిట్ వస్తుందనా..?
అవును, పది, ఇంటర్ పరీక్షల రద్దు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొంత కాలంగా పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. దాదాపు ప్రతీరోజూ పరీక్షల రద్దు చేయమంటూ సర్కారుకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. నిత్యం వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతు.. వారి వేదన వింటున్నారు. ఆ వేదనను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. పరీక్షల రద్దుపై కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు. అయినా.. లోకేశ్ డిమాండ్‌ను జగన్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయడమో.. రద్దు చేయడమో చేశాయి. ఒక్క ఏపీ మాత్రమే ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిద్దామా అని ఆత్రుత పడుతోంది.
ఏపీలో కరోనా కల్లోలం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ ప్రతీరోజూ వేలల్లో కేసులు. పదుల సంఖ్యలో మరణాలు. వీటికి తోడు బ్లాక్‌ఫంగస్. ఇంతగా కరోనా ప్రమాదం పొంచిఉంది కాబట్టే.. ప్రభుత్వం సైతం కర్ఫ్యూని పొడిగిస్తూ వస్తోంది. మరి, ప్రజలు బయటకు రావడానికే ఆంక్షలు విధించిన సర్కారు.. లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే పది, ఇంటర్ పరీక్షలను మాత్రం యధావిధిగా నిర్వహించాలనుకోవడం ఏవిధంగా కరెక్టో వారికే తెలియాలి. కనీసం కేంద్ర నిర్ణయం తర్వాతనైనా సీఎం జగన్‌రెడ్డిలో మార్పు వస్తే బాగుండు అంటున్నారు విజ్ఞులు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నాక తాజాగా మరోసారి నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే వైసీపీ ప్రభుత్వ మొండివైఖరి సరికాదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. 'పరీక్షలపై సమావేశం నిర్వహణకు సీఎం జగన్‌కు సమయం సరిపోవట్లేదు. ప్రధాని మోదీకి సమయం దొరికింది గానీ.. జగన్‌కు మాత్రం సమయం దొరకట్లేదు'. అని లోకేశ్ విమర్శించారు.