కేసీఆర్ జైలుకి.. ఈటల ఢిల్లీకి! బీజేపీ బాంబ్ పేల్చనుందా!
posted on Jun 2, 2021 @ 2:40PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా? ఎవరూ ఊహించని పరిణామాలు ఉంటాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది కొన్ని వర్గాల నుంచి. కేసీఆర్ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు కూడా తెలంగాణలో ఏదో జరగబోతుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజేందర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరపడం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో... సంచలనాలు జరగబోతున్నాయనే సంకేతం వస్తోంది.
బీజేపీ వర్గాలు, ఈటల రాజేందర్ అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గులాబీ బాస్ టార్గెట్ గానే కీలక ఘటనలు జరగనున్నాయని తెలుస్తోంది. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతి చేసిందని విపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు కూడా పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో బండి సంజయ్.. త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తర్వాత కొంత వెనక్కి తగ్గారు. తాజాగా మరోసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని తెలిపారు. కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసుల పైనే ఆరా తీస్తున్నాం. ఈ స్కాంలు చూశాకే కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయింది. త్వరలో ఆయనును జైలుకు పంపించడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బండి సంజయ్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే సంజయ్ అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఈటల రాజేందర్ .. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ హైకమాండ్ ముందు ఈటల కొన్ని షరతులు పెట్టారని తెలుస్తోంది. అందులో ప్రధానమైనది కేసీఆర్ కుటుంబ అవినీతేనట. తనపై భూకబ్జా ఆరోపణలు చేసి కేబినెట్ నుంచి తప్పించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పైనా అదే స్థాయిలో రివేంజ్ తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే తాను బీజేపీలో చేరాలంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారట. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని రాజేందర్ చెప్పారట. దానికి బదులిచ్చిన జేపీ నడ్డా.. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబ కుంభకోణాలపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారని అంటున్నారు.
ఈటల రాజేందర్ తో జరిగిన చర్చల్లో జేపీ నడ్డా ఇచ్చిన హామీ మేరకే.. కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందన్న ప్రచారం సాగుతుండటంతో.. దానికి తెరదించాలని కూడా కాషాయ పెద్దలు సూచించారట. పశ్చిమ బెంగాల్ తరహాలో ఉద్యమించాలని బండి సంజయ్ కు జేపీ నడ్డా సూచించారని తెలుస్తోంది. హైకమాండ్ డైరెక్షన్ లో ఇకపై టీఆర్ఎస్ నే తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తారని అంటున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో ఎప్పుడు చేరుతారన్నది తేలడం లేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరతారని బండి సంజయ్ చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ఈటల చేరిక ఆలస్యం కావడానికి మరో కారణం ఉందంటున్నారు. ముందు కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటపెట్టి.. అతన్ని జనంలో దోషిగా నిలబెట్టాలని రాజేందర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రంతో విచారణ జరిపించాకే.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారని అంటున్నారు. రాజేందర్ ముఖ్య అనుచరులు మాత్రం మరో వాదన చేస్తున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపించి.. ఈటల రాజేందర్ కేంద్ర కేబినెట్ లో చేరుతారని చెబుతున్నారు.