కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి ఎవరు ?
posted on Jun 24, 2021 @ 1:33PM
కేంద్ర మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఇంకా ముడిపడలేదు. అయితే, జులై రెండవ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్న నేపధ్యంలో, మంత్రివర్గ విస్తరణ ఈలోగా ఎప్పుడైనా ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం.జమ్మూ కశ్మీర్ కు మళ్ళీ రాష్ట్ర హోదా కలిపించే విషయంలో ఆ రాష్ట్రానికిచెందిన వివిధ పార్టీల నాయకులతో ప్రధాని మోడీ గురువారం సమావేసమవుతున్నారు. దీంతో పొలిటికల్ ఫోకస్ అటు మరలింది. మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుందన్న విషయంలో అటు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ మాట బయటకు వచ్చినప్పటి నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, అనేక పేర్లు తెర మీదకు వచ్చాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు, జీవీఎల్ నరసింహ రావు, సీఎం రమేష్ పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి. ఈ రెండు పేర్లనే కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోందని, విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా బీజేపీ నాయకులు, సీఎం రమేష్ కంటే సొంత మనిషి జీవీఎల్ వైపే మొగ్గుచుపుతున్నట్లు చెపుతున్నారు.
మరో వైపు తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన సీఎం రమేష్ ఎలాగైనా మంత్రి పదవి సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, సామాజిక సంబంధాలు ఆధారంగా ఏర్పరచుకున్న రాజకీయ సంబంధాలను ,అలాగే, పాత కొత్త, రాజకీయ సామాజిక, సంబంధాలను ఉపయోగించి అయినా మంత్రి వర్గంలో స్థానం సంపాదించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే,ఆ ప్రయత్నాలే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, ఆయన సన్నిహిత వర్గాలే అనుమానిస్తున్నాయి.నిజమే కావచ్చును, ఒకప్పుడు ఆయనకు బీజేపీ కీలక నేతలలో కొందరితో మంచి సంబంధాలు ఉంటే ఉండవచ్చును, కానీ, ప్రస్తుతం ఆ నేతల పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించుకోవాలని, రమేష్’ను ఆయన సన్నిహుతులే హెచ్చరిస్తునారు. మరో వంక బీజీపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా పుట్టు బీజేపీ నాయకులు రమేష్’కు మంత్రివర్గంలోకి తీసుకుంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోతుందని హెచ్చరిస్తున్నారు. ఒక సారి ఆయన గతాన్ని గుర్తు చేసుకోవాలని అంటున్నారు.ఆయన గతం పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయని,పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ అధినాయకత్వందృష్టికి తీసుకు వెళ్ళారని తెలుస్తోంది.
2019 ఎన్నికలవరకు తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించిన సీఎం రమేష్, ఎన్నికల అనంతరం బీజేపీలో చేరినా ఆయన పాత సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు, అనుమానాలు తరచు చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో సీఎం రమేష్’కు మంత్రి పదవి ఇస్తే ఆయన వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని, బీజేపీ సీనియర్ నాయకులు కుండబద్దలు కొడుతున్నారు. పార్టీ ఐడియాలజీ మీద విశ్వాసంతో కాకుండా, రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకోసం పార్టీ పంచన చేరే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలే గానీ, వారికి ఉన్న ఆర్థిక స్థోమతను ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, దీర్ఘ కాలంలో అంతకు అంత మూల్యం చెల్లించక తప్పదని బీజీపీ సీనియర్లతో పాటుగా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో అవక్రతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కుంటున్న విని మంత్రి వర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని, సో .. ఎట్టి పరిస్థితిలో అలంటి వారికి అవకాశం ఇవ్వరాదని అనటున్నారు.
బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలతో పాటుగా, టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులు, పెద్దల సభ సభ్యులు కూడా, రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలను దుష్టిలో ఉంచుకుని, జీవీఎల్ నరసింహారావుకు మంత్రి వర్గంలో స్థానం కలిపించాలని అంటున్నారు. నిజానికి, ఏపీ నుంచి ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే విషయంలో కేంద్ర నాయకత్వం వివిధ మార్గాలలో సమాచారన్ని సేకరించిందని రాష్ట్ర పార్టీ నాయకులు చెపుతున్నారు. అయితే, అంతిమ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేమని పార్టీ నేతలు, పరిశీలకులు అంటున్నారు.