సునీత ఇంటి దగ్గర రెక్కీ!.. ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు.. అది వారి పనేనా?
posted on Aug 13, 2021 @ 3:42PM
సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ వివేక హత్య కేసు విచారణ వేగంగా జరుగుతోంది. రెండు నెలలుగా సీబీఐ ఇదే పని మీద ఉంది. వాచ్‌మెన్ వాంగ్మూలం కీలకంగా మారింది. కొందరు పెద్దలు మినహా అనుమానితులందరినీ ప్రశ్నిస్తోంది. వేరు వేరు కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది. నిందితుడు సునీల్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇంకా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రకటించిన వారినీ విచారించేందుకు సిద్ధమవుతోంది. సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో.. సడెన్‌గా వైఎస్ వివేకా కూతురు సునీత ఇంటి దగ్గర ఓ అగంతకుడు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. సకాలంలో గుర్తించిన సునీత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్ సునీత లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటికి సమీపంలో ఆగి ఎవరికో ఫోన్ కాల్స్ చేశాడని లేఖలో సునీత తెలిపారు.
శివశంకర్‌రెడ్డి బర్త్ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని రాశారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని.. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు.
తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, అతని అనుచరుడు మణికంఠరెడ్డి తమ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం తమకు భయాందోళనకు గురి చేస్తోందని సునీత వాపోతున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు.. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు సునీత.