జగన్ అనుచరుడిని విచారించిన సీబీఐ... వివేకా హత్య కేసులో ట్విస్ట్!
posted on Aug 13, 2021 @ 6:45PM
ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. 68 రోజులుగా విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు దూకుడుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ముఖ్యంగా సునీల్ కుమార్ యాదవ్ ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేశాకా కీలక అంశాలు బయటికి వచ్చాయి. సునీల్ కుమార్ ఇస్తున్న సమాధానాల ఆధారంగానే ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు ముందుకు సాగుతోందని తెలుస్తోంది.
వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన సీబీఐ దృష్టి సారించింది. శుక్రవారం విచారణకు రఘునాధ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి హాజరైనారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రఘునాధ్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. పులివెందులలో సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. శివశంకర్‌రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. అంతేకాదు ప్రస్తుతం ఆయన వైసీపీ రాష్ట్రకార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివశంకర్‌రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్‌రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు విచారించాయి.
శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మణికంఠరెడ్డిపై వివేకా కుమారై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్ తరువాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్స్‌చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సునీతా రెడ్డి పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బర్త్ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని సునీత కోరారు. సునీత ఫిర్యాదు ఇవ్వడం, శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం ఇప్పుడు చర్చగా మారింది.