నదిలో 132 లారీలు.. ముంచెత్తిన కృష్ణా వరద.. డ్రైవర్లు విలవిల..
posted on Aug 14, 2021 @ 12:43PM
అది కృష్ణానది. ఎప్పటిలానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. లారీ వెనుక లారీ.. అలా వందలాది లారీలు.. నది తీరంలో వరుస కడుతున్నాయి. ఎప్పుడూ జరిగేదే ఇది. కానీ, ఈసారి రొటీన్‌కు భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. ఒక్కసారిగా కృష్ణమ్మ పొంగిపొర్లింది. బిరబిరా వరద పోటెత్తింది. చూస్తుండగానే నది నిండుగా మారిపోయింది. అంతే.. లారీల చుట్టూ నీళ్లు. నీళ్లలో లారీలు. ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు ప్రాణాలతో చెలగాటంగా పరిణమించింది. నదిలో నుంచి బయటపడే దారిలేక, నదిలో ఉండలేక.. లారీ డ్రైవర్లు విలవిల్లాడుతున్నారు. ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.....
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు దగ్గర కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా లారీలు వరదలో చిక్కుకున్నాయి. అకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 132 లారీలు వరదలో ఇరుక్కుపోయినట్టు సమాచారం. ఒడ్డుకు ఎలా చేరాలో తెలీక లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు.
పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పడవల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు. నదీ ఉధృతి తగ్గితేనే.. వాహనాలు బయటకు తీసుకురాగలమని అంటున్నారు అధికారులు.