థర్డ్ వేవ్ వచ్చేసిందా? 10రోజుల్లో 543మంది పిల్లలకు కరోనా..
posted on Aug 13, 2021 @ 11:40AM
ఆగస్టు.. సెప్టెంబర్.. అక్టోబర్.. థర్డ్ వేవ్ ఎప్పుడైనా రావొచ్చు. ఎక్కువ సమయం ఇవ్వదు. వచ్చీ రాగానే కుమ్మేస్తుంది. ఈసారి పిల్లలపైనే ప్రభావం చూపుతుంది. ఇలా అనేక వార్తా కథనాలు.. సూచనలు..హెచ్చరికలు. ఏ చిన్న సింప్టమ్ కనిపించినా కరోనానేమో అనే టెన్షన్. కేసులు పెరుగుతున్నాయంటే థర్డ్ వేవ్ ఏమోననే భయం. తాజాగా, బెంగళరులో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. అందులోనూ చిన్నారులకు భారీగా సోకుతోంది. ఇదిగో థర్డ్ వేవ్ అంటూ ప్రచారం మొదలైపోయింది. ప్రజల్లో కంగారు పెరిగిపోయింది.
ఒక్క బెంగళూరులోనే ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ 543మంది చిన్నారులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. బాధితులంతా 19 ఏళ్ల లోపు వయసు ఉన్నవారే. ఇదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మూడో ముప్పు బెంగళూరు నుంచి మొదలైపోయిందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. 40వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రియాశీల రేటు 1.20కి పెరిగింది. అటు మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకరం.
తాజాగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 40,120 కేసులు వచ్చాయి. ఒక్క రోజులోనే 585 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.46 శాతం ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 52.95 కోట్ల టీకాలు పంపిణీ చేశారు.