రేవంత్ రెండో దండోరా వేదిక చేంజ్.. కోమటిరెడ్డి భయమే కారణమా?
posted on Aug 13, 2021 @ 8:33PM
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దూసుకుపోతున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతున్నారు. పీసీసీ చీఫ్ కాగానే ఛలో రాజ్ భవన్ నిరసనలతో రాజకీయాలను హీటెక్కించారు రేవంత్ రెడ్డి. పార్టీలోని సీనియర్లను కలుస్తూ వారి మద్దతుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోగా సూపర్ సక్సెస్ అయిందనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అదే జోష్ తో ఇబ్రహీంపట్నంలో రెండో గర్జన ఉంటుందని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే కొత్త సమస్య ఎదురైంది.
పీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి నియామకం తర్వాత అసమ్మతి స్వరం వినిపించారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా వివాదాస్పద కామెంట్లతో పార్టీలో కాక రేపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతల కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కోమటిరెడ్డి.. రేవంత్ పిలుపిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇంద్రవెల్లి సభకు దూరంగానే ఉన్నారు కోమటిరెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సీనియర్లందరిని కలిశారు కాని ఇంతవరకు కోమటిరెడ్డి బ్రదర్స్ ను మాత్రం కలవలేదు. కలిసేందుకు రేవంత్ ఆసక్తి చూపినా.. కోమటిరెడ్డి సోదరులు ఇష్టపడలేదని చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి బ్రదర్స్ గ్యాప్ కొనసాగుతూనే ఉంది.
ఇంతలోనే ఇబ్రహీంపట్నంలో రెండో దళిత గిరిజిన దండోరా నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడంతో వాళ్లిద్దరి మధ్య వివాదాన్ని మరింత పెంచేసింది. ఇంద్రవెల్లి సభ ముగియగానే ఇబ్రహీంపట్నం దండోరా ప్రకటించారు పీసీసీ చీఫ్. అయితే ఇబ్రహీంపట్నం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్ సభ పరిధిలోకి వస్తోంది. ఎంపీగా ఉన్న తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇబ్రహీంపట్నంలో సభ పెట్టడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు పార్లమెంటరి కమిటీ సమావేశాలు ఉన్నందున.. 18వ తేదీన తాను అందుబాటులో ఉండబోనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీకి సమాచారం ఇచ్చారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో సభ పెట్టడానికి వ్యతిరేకంగానే కోమటిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది.
పార్టీ పెద్దలకు కూడా ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారట, అటు పీసీసీ కూడా ఈ విషయంలో లోతుగా చర్చించదని తెలుస్తోంది. లోకల్ ఎంపీకి తెలియకుండా ఆయన నియోజకవర్గంలో సభ పెట్టడాన్ని కొందరు పార్టీ సీనియర్లు తప్పుపట్టారని సమాచారం. ఇబ్రహీంపట్నంలో జరిగే దండోరా సభకు.. లోకల్ ఎంపీ రాకపోతే పార్టీలో విభేదాలు ఉన్నాయనే అంశం తెరపైకి వస్తుందని హెచ్చరించారట. అందుకే మధ్యేమార్గంగా సభను అదే రోజు కొనసాగిస్తూనే వేదిక మార్చాలని డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించాల్సిన దళిత గిరిజన దండోరా సభను మహేశ్వరంలో నిర్వహించబోతున్నారు.మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల లోక్ సభ పరిధిలోకి వస్తుంది. కోమటిరెడ్డికు సంబంధం లేకుండా ఉండటానికే రేవంత్ రెడ్డి టీమ్ అలా ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అనుకున్న రోజు సభ పెట్టడంతో పాటు కోమటిరెడ్డి నుంచి వ్యతిరేకత లేకుండా ఇలా నరుక్కొచ్చారని చెబుతున్నారు.
మొత్తానికి ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభ మహేశ్వానికి మారడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే కారణమని చెబుతున్నారు. దూకుడుగా వెళుతున్న రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కొంత బ్రేకులు వేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.