గుండెపోటా.. గొడ్డలి పోటా? వివేకా కేసులో విజయసాయి ఇరుక్కుంటారా?
posted on Aug 13, 2021 @ 1:25PM
ఆ సీన్ చూడగానే చిన్నపిల్లాడికైనా ఇట్టే అర్థమైపోతుంది. చుట్టూ రక్తం పడుగు.. మధ్యలో శవం.. తలపై పెద్ద పెద్ద గాట్లు.. ఒంటినిండా గాయాలు.. అది పక్కా మర్డర్ అని ఇట్టే చెప్పేయవచ్చు. కానీ, వాళ్లు అలా చెప్పలేదు. అలాగని వాళ్లేమీ కళ్లులేని కబోదులో, మానసిక వికలాంగులో కాదు.. అచ్చంగా పార్లమెంట్ సభ్యులు.. అందుకే ఇంతటి ఆశ్చర్యం. సీబీఐ సైతం ఇదే అంశంపై ఫోకస్ పెంచింది. వైఎస్ వివేకానందరెడ్డిది మర్డర్ అని అంత స్పష్టంగా తెలుస్తున్నా.. ఆయన గుండెపోటుతో చనిపోయారని వైఎస్ అవినాశ్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలాంటి వాళ్లు ఎలా ప్రకటించారు? ఎందుకు అలాంటి మెసేజ్ ఇచ్చారనే యాంగిల్‌పై సీబీఐ దృష్టి సారించింది. దీని వెనుక ఎవరినైనా కాపాడే ప్రయత్నం ఉందా? పెద్ద ఎత్తున కుట్ర దాగుందా? అని కూడా అనుమానిస్తున్నారు. ఇదే అంశాన్ని అటు టీడీపీ సైతం పదే పదే ప్రశ్నిస్తోంది. తాజాగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వివేకానందరెడ్డిది గుండెపోటా.. గొడ్డలి పోటా? అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. వాస్తవాలు బయటకు రావాలంటే, ఉత్తరాంధ్ర బందిపోటు విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి చనిపోయిన వెంటనే ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పింది విజయ సాయి రెడ్డే అని అన్నారు. అసలు విషయం బయటకు రాకముందే.. ఆయన ఎందుకు అలా చెప్పారని నిలదీశారు.
తొలుత గుండెపోటని, తరువాత హత్యని, ఆ తరువాత చంద్రబాబే వివేకానందరెడ్డిని చంపించాడని ఏ2 విజయసాయిరెడ్డి పొంతనలేకుండా ఎందుకు మాట్లాడో తేల్చాలన్నారు బుద్దా వెంకన్న. సీబీఐ పులివెందులలో విచారణకు వచ్చినప్పుడల్లా విజయసాయి ఎంపీనంటూ ఢిల్లీ పారిపోతున్నారని విమర్శించారు. విజయసాయి దోపిడీపై ఉత్తరాంధ్రవాసులు ఎందుకు తిరగబడటం లేదని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు విజయసాయిని ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.