హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా?
posted on Aug 13, 2021 @ 3:14PM
హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? షెడ్యూలు ఎప్పుడు విడుదలవుతుంది? ఎప్పుడో తెలియదు కానీ, ఇప్పుడైతే కాదు. ఆగష్టు చివరి వరకు అయితే, ఖాయంగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమే లేదు. నిన్న మొన్నటి వరకు ఆగష్టు 16 తేదీలోగానే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని, కేంద్ర ఎన్నికల సంఘం చల్లని కబురు మెల్లగా చెప్పింది. ఆగష్టు 16 లోగానే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వస్చేస్తుందనే, ముఖ్యమంత్రి 16 తేదీన హుజురాబాద్ నుంచి ప్రారంభించవలసి ఉన్న దళిత బంధు పథకన్ని, అనుకున్న రీతిలో హుజూరాబాద్ లో కాకుండా, దత్తత గ్రామా వాసాలమర్రిలో ముందుగానే మమ అనిపించారు. నోటి మాటగానే ప్రారంభించినట్లే అనుకోండని ప్రకటించారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం, కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ సహా దేశంలో ఖాళీగా ఉన్న వందకు పైగా అసెంబ్లీ, లోక్ సభ, మండలి స్థానాలకు ఎన్నికలు/ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలానే విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. ఉప ఎన్నికలే కాదు, వచ్చేసంవత్సరం (2022)ప్రారంభంలో జరగవలసి ఉన్న ఉత్తర పదేశ్ సహా ఐదు రాష్టాల శాసన సభ ఎన్నికల విషయంలోనూ ఈసీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈ పరిస్థితిని గమనిస్తే ఎన్నికల నిర్వాహణపై గతంలో ఎన్నికల సంఘానికి మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపధ్యంలో, ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాలతోనే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అంతే, కాదు, కొవిడ్ పరిస్థితులను పట్టించుకోకుండా, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన అధికారిని, ఉరి తీయాలని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం. కొవిడ్ మహమ్మారి విషయంలో ఒక స్పష్టత వచ్చే వరకు అన్ని ఎన్నికలను వాయిదా వేయడమే మంచిదన్న ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికలసంఘం తాజాగా దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతూ లేఖలు రాసింది. ఉప ఎన్నికలతో పాటుగా ఐదు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై పార్టీలు తమ అభిప్రాయాలు ఆగస్టు 30 లోగా తెలియజేయాలని లేఖలో కోరింది. అంటే ఆగష్టు 30కి ముందు, ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదు. ఆగస్టు 30 తరువాతే హుజూరాబాద్ ఉపఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే, అప్పటికీ కొవిడ్ మహమ్మారి పరిస్థితిలో మార్పు రాకుంటే, ఉప ఎన్నిక ఇంకా వెనక్కి వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదు.
అదలా ఉంటే ఉప ఎన్నిక ఆలస్యం అయితే, అది అధికార పార్టీ ఉపకరిస్తుందని అంటున్నారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పట్ల ప్రస్తుతమున్న సానుభూతి చల్లారడంతో పాటుగా, ప్రభుత్వం ఓటర్లకు వలవేసేందుకు ఉద్దేశించిన దళిత బంధు వంటి పథకాలను అమలు చేసేందుకు వెసులుబాటు లభిస్తుందని గులాబీ పార్టీలో వినవస్తోంది. మరోవంక బీజేపీ ఎన్నికలు ఎంత త్వరగా ముగిస్తే, అంట మంచిదని భావిస్తోంది. అయితే, అల్టిమేట్’గా ఏ నిర్ణయం అయినా తీసుకోవలసింది కేంద్ర ఎన్నికల సంఘం, తీర్పును ఇవ్వవలసింది హుజూరాబాద్ ప్రజలు.