చలానాల కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం?
posted on Aug 14, 2021 @ 11:11AM
నకిలీ చలానాల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో జరిగిన అక్రమాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేస్తున్నాయి. చలానా మార్ఫింగ్ తో దాదాపు 10 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. చలనాల కుంభకోణంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పై అధికారులు వేటు వేశారు. కడపలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే నకిలీ చలానాలకు సంబంధించి మొత్తం 5.5 కోట్ల రూపాయలు తేడా వచ్చినట్టు గుర్తించామని ఉన్నతాధికారులు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 ప్రాంతాల్లో ఇలాంటి అవకతవకలు జరిగినట్టు నిర్ధారించారు. కృష్ణా, కడప జిల్లాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేరుకున్నాయి.
నకిలీ చలానాల కుంభకోణంలో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశాలు లేవని అంటున్నారు. ప్రజాప్రతినిధులకు వాటాలు ఇచ్చే కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా కుంభకోణానికి తెర తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి చలానాల కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. మంత్రి నుంచి అనేకమంది వైసీపీ పెద్దలకు కోట్ల రూపాయలు వాటాలు వెళ్ళాయన్నారు. చాలనాల కుంభకోణంలో మంత్రి రాజీనామా చేసి దర్యాప్తు చేస్తే కొంత అయినా నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారులపై విచారణ చేసి చేతులు దులుపుకోవాలను కోవటం కుట్రలో భాగమే అని అన్నారు. ఇది గతంలో జరిగిన నకిలీ స్టాంపుల స్కాం తెల్గిని మించి ఏపీలో వైసీపీ నాయకులు దోచేశారని వ్యాఖ్యానించారు. వైసీపీకి చిత్త శుద్ధి ఉంటే మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ చేస్తే నిజాలు నిగ్గు తెలుతాయని బోండా ఉమా అన్నారు.
మరోవైపు నకిలీ చలానాల అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన చర్చించారు. సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సమాధానంగా ఇప్పటికే రూ. 40 లక్షలు రికవరీ చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.