గెల్లుకు టికెట్ వెనుక అసలు కారణం ఇదా.. కేసీఆర్ అంతగా భయపడ్డారా?
posted on Aug 13, 2021 @ 6:45PM
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్కెచ్ గీస్తే చాలా పక్కాగా ఉంటుంది. ముఖ్యంగా,రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. అలాంటి సందర్భాలలో అయన అనూహ్యంగా పావులు కదుపుతారు. రాజకీయ చతురతను చూపుతారు. మాటల గారడీ చేస్తారు. కనికట్టుతో అందరినీ కట్టిపడేస్తారు. ఇప్పుడు, కాదు ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్’ నైజం అదే అంటారు, ఆయనేమిటో తెలిసిన, అయన నిజ నిజాన్నిరుచి చూసిన మాజీ మిత్రులు. నిజానికి, రాజకీయంగా ఎంతగా వత్తిడి ఎదురైతే అంతగా కేసీఆర్ నిజరూపం బయటకు వస్తుందనేది మాజీ మిత్రుల మాట.
ప్రస్తుతం కేసీఆర్ అదే పరిస్థితిలో ఉన్నారా? రాజకీయంగా వత్తిడి ఎదుర్కుంటున్నారా, అంటే అవునననే అంటున్నారు. ఒక దిక్కు నుంచి కాదు అష్ట దిక్కుల నుంచి కేసీఆర్ చిక్కులను ఎదుర్కుంటున్నారని, అంతర్గత సమాచారం తెలిసిన పార్టీ వర్గాల సమాచారం. ఈటలతో అనవసరంగా తలగోక్కుని, తిప్పలు కొనితెచ్చుకున్నారు. ఇది ఎవరో అంటున్న మాట కాదు, వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ పెద్దలు వ్యక్త పరుస్తున్న అభిప్రాయం. కారణాలు, ఏవైనా హుజూరాబాద్ నియోజక వర్గంలో తెరాస అంటే ఈటల, ఈటల అంటే తెరాస. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా చివరకు ఆరడుగుల బులెట్ హరీష్ రావే అయినా ఈటల తర్వాతనే. అంతే కాదు ఈటలను కాదంటే ఎన్నికలో పోటీ చేసేందుకు పార్టీకి అభ్యర్ధి దొరకడం కూడా కష్టమే. అదే ఇప్పుడు చూస్తున్నాం.
ఇంచుమించుగా రెండు నెలలకు పైగా ఆ పార్టీ వాళ్ళను, ఈ పార్టీ వాళ్ళను ఎక్కడెక్కడి వారిని తోలుకొచ్చి దొడ్లో కట్టేసుకున్నా కేసీఆర్ కు ఈటలకు సమ ఉజ్జీగా నిలిచే అభ్యర్ధి దొరకలేదంటే, పరిస్థతి ఏమిటో అర్థం చేసుకోవచ్చును. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లుగా ఎవరూ లేక, ఎవరు దొరక్కనే, కేసీఆర్ చివరకు విద్యార్ధి నాయకుడు గెల్లు శ్రీనివాస్ ని బరిలో దించుతున్నారని అంటున్నారు. అలాగన ఇంచు మించుగా 40 ఏళ్ళు దగ్గర పడిన విద్యార్ధి నాయకుదు గెల్లును ఎంపిక చేయడం వెనక వ్యూహం, ఎత్తుగడ లేదని కాదు. అయితే, ఆ వ్యూహం ఎత్తుగడ గెలిచేందుకు మాత్రమే, కాదు ఓడిపోయినా, పరువును కాపాడుకునే వ్యూహంలో భాగంగానే ఉందని, పడిపోయినా మళ్ళీ పైకి లేచే విధంగా కేసీఆర్ గెల్లును ఏంపిక చేశారని అంటున్నారు.
నిన్న మొనంటి వరకు హుజూరాబాద్ లో పోటీ పార్టీలు, అభ్యర్ధుల మధ్య కాదు. పోటీ కేసీఆర్ వర్సెస్ ఈటల, పోటీ ఉద్యమకారులు వర్సెస్ ఉద్యమ ద్రోహుల మధ్య అనే భావన బలంగా జనంలోకి వెళ్ళింది. ఇప్పుడు, ఆ పర్సెప్షన్ కొంత మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈటల దమ్ముంటే కేసేఆర్ లేదా హరీష్ పోటీ చేయాలని సవాలు విసిరిన 24 గంటలలోనే, గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించారు. నిజానికి ఆగష్టు 16 న దళిత బంధు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి స్వయంగా సభా ముఖంగా, ఘనంగా తెరాస అభ్యర్ధి పేరును ప్రకటిస్తారని ప్రచారం జరిగిన అదేమీ లేకుండా,అందుకు ఐదు రోజులు ముందుగానే, తూతూ మంత్రం గెల్లు పేరును ప్రకటించారు. ఈటల సవాలును స్వీకరించే ధైర్యం లేకనే, ముందుగానే గెల్లు పేరును ప్రకటించారని, ఇది కూడా కేసీఆర్ వ్యూహంలో బాగమే అంటున్నారు. ఒక విధంగా చూస్తే కేసీఆర్, వ్యూహాజనిత పోటీ నుంచి కూడా పారిపోయారు, లేదా తప్పుకున్నారు. అలాగే, ఉద్యమాల నుంచి వచ్చిన గెల్లుని బరిలో దించడం ద్వారా ఉద్యమ వాదాన్ని కొంతవరకు పక్కకు తప్పించారు. అలాగే, బీసీ ఫాక్టర్’ను కూడా పరిగణన లోకి తీసుకునే గెల్లు ఎంపిక చేశారు.
అయితే కేసీఆర్ స్కెచ్ ఎంత పక్కగా ప్లాన్ చేసినా, హుజూరాబాద్ ఉప ఎన్నిక బరి నుంచి కేసీఆర్ vg ప్పించుకోలేరని అంటున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, హుజూరాబాద్ బరిలో నిలిచింది, కేసీఆర్, ఈటల. అంతే కాదు, అందరూ ఉహిస్తున్నట్లుగా హుజూరాబాద్ తెరాస ఓడిపోతే, అది గెల్లు ఓటమీ కాదు కేసీఆర్ ఓటమిగానే జనం చూస్తారు.అలాగే తెరాస ఓటమిని ఉద్యమ ద్రోహుల ఓటమిగానే చరిత్ర గుర్తిస్తుందని అంటున్నారు.