పంజాబ్ లో రాజ్యాంగ సంక్షోభం తప్పదా?
posted on Sep 29, 2021 @ 2:52PM
పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, ప్రియాంకా వాద్రా, సిద్దూను శాంతింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరో వంక సిద్దూకు మద్దతుగా మంత్రి రజియా సుల్తానా కూడా తమ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఒకరిద్దరు పార్టీ నాయకులు కూడా రాజీనామాచేశారు. మరికొందరు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.అదే నిజమయితే, పంజాబ్’ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం మరింత ముదిరి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
సిద్దూ ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్న మాత్రం డైరెక్ట్ సమాధానం చిక్కని ప్రశ్నగానే మిగిలి పోయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయన కోరిన కోరికలన్నింటినీ కాదనకుండా నెరవేర్చింది. పీసీసీ అధ్యక్షపదవి అడిగారు, ఆప్పటి ముఖ్యమంత్రి పార్టీ సీనియర్ నాయకుడు, కెప్టెన్ అమరీందర్ సింగ్’కు ఇష్టం లేక పోయినా, సోనియా గాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కెప్టెన్’ను ఒప్పించి సిద్దూకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అక్కడికీ సిద్దూ సంతృప్తి చెందకపోవడంతో ముఖ్యమంత్రిని మార్చి సిద్దూ కోరుకున్న చరణ్‌జిత్ సింగ్ చన్నిని ముఖ్యమంత్రిని చేశారు...అయినా సిద్దూ పార్టీ నాయకులు,సోనియా,రాహుల్,ప్రియాంక త్రయంలో ఏ ఒక్కరికీ మాట మాత్రంగా అయినా, చెప్పకుండా, ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నట్లుగా, సిద్దూ నిలకడలేని మనిషే అనుకున్నా ఆయన ఎందుకు రాజీనామా చేశారు, అనేది మాత్రం ఇంకా భేతాళ ప్రశ్నగానే ఉందని అంటున్నారు.
ఇతర కారణాలున్నా ప్రధానంగా కొత్త క్యాబినెట్ కూర్పు పట్ల అసంతృప్తితోనే ఆయన పదవి నుంచి వైదొలగినట్టు సమాచరం.ఇటీవలే ముఖ్యమంత్రిగా నియమితులైన చరణ్‌జిత్ సింగ్ చన్ని గత ఆదివారం నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. దీనికి ముందు, ఇసుక తవ్వకాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రణగుర్జీత్ సింగ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దని కోరుతూ కొంతమంది ఎమ్మెల్యేలు సిద్దూకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇవే ఆరోపణలపై అమరీందర్ సింగ్ మంత్రివర్గం నుంచి రణగుర్జీత్ సింగ్ ఉద్వాసనకు గురయ్యారు.అయితే సీఎం చన్ని ఆయనకు మళ్లీ మంత్రిపదవి కట్టబెట్టడాన్ని సిద్దూ అడ్డుకోలేకపోయారు. దీంతోపాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ఇంకొందరిపైనా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు.
పీసీసీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌కుమార్ చబేవాల్‌కు మంత్రివర్గంలో స్థానం కోసం సిద్దూ కొంతకాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే రాజ్‌కుమార్‌కు పదవి దక్కకపోగా... చన్నీకి బంధువైన అరుణా చౌధరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. అరుణా చౌధరి తన సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్టు చాలాకాలంగా ప్రచారంలో ఉంది.తాజా క్యాబినెట్ కూర్పులో కులాల సమీకరణ పట్ల కూడా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ జనాభాలో 30శాతం ఉన్న మజాబీ సిక్కులను పక్కనబెట్టి... తన సొంత కులానికే సీఎం చన్ని అధిక ప్రాధాన్యం ఇచ్చారని సిద్దూ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే రాహుల్ గాంధీ, పీసీసీ ఆమోదం తర్వాతే మంత్రివర్గం ఎంపిక జరిగిందని చన్ని మద్దతుదారులు అంటున్నారు.
తాజాగా సిద్దూ, “నిజం” కోసం తుది శ్వాస ఉన్నంత వరకూ పోరాడుతానని చెప్పారు.సిద్దూ తన రాజీనామాకు సమబందించి మీడియాలో జరుగతున్న ప్రచారానికి సమాదానంగా ఈ రోజు ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత ఎజెండా కోసం పోరాడలేదని, పంజాబ్ సంక్షేమం కోసమే కొట్టాడుతున్నానని, ఈ విషయంలో ఎప్పటికీ రాజీపడేదే లేదని వీడియోలో సిద్ధూ స్పష్టం చేశారు.ఎటువంటి త్యాగాలకైనా తాను సిద్ధమేనని, కాంగ్రెస్ హైకమాండ్‌ను తాను తప్పుదారి పట్టించలేనని సిద్ధూ తెలిపారు. పంజాబ్‌లో కొత్తగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు, అధికారులతో కొత్త వ్యవస్థను నడపలేమని అన్నారు. విలువల కోసం తాను పోరాడుతున్నానని, ఈ విషయంలో తాను వెనుకడుగేసేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. నిజం కోసం తుది శ్వాస వరకు పోరాడతానన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందని అంటున్నారు. ఇప్పటికే సిద్దూకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇచ్చారని, ఇంకా ఆయన కోరిన విధంగా మంత్రివర్గంలో మార్పులు చేస్తే, అధిష్టానం ప్రతిష్ట ఇంకా దిగజారి పోతుందని అంటున్నారు. మరోవంక,పంజాబ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపరిపక్వ రాజకీయ అనుభవం వల్లనే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఈ స్థాయికి చేరిందని పార్టీ వర్గాల్లో చర్చ నడిస్తోంది. రాష్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అన్నా చెల్లెలు (రాజీవ్,ప్రియాంక) అనుభవ రాహిత్యం పార్టీకి ప్రమాదకర ముప్పుగా పరిణమిస్తుందని బహిరంగంగానే హెచ్చరించారు. మరో వంక పార్టీ ఇంత సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నా,సీనియర్ నాయకులు ఎవరూ పెదవి విప్పక పోవడం కాంగ్రెస్ పార్టీ సంక్షోభానికి సంకేతమని అంటున్నారు.