పోసానిని వైసీపీనే రెచ్చగొట్టిందా? దాడి జరిగేలా తిట్టించిందా?
posted on Sep 29, 2021 @ 3:30PM
జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వైసీపీ నేతలు పనికిమాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి అన్నారు. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహాలు వేస్తారని విమర్శించారు. జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్న నాదేండ్ల మనోహర్ ఇలా పోసానిని వైసీపీ నేతలే రెచ్చగొట్టారని.. పోసానిపై దాడి జరిగేలా వ్యూహం పన్నారని ఆరోపించడం కలకలం రేపుతోంది. కాస్త ఆలోచిస్తే.. నాదేండ్ల చేసిన ఆరోపణ నిజమేనని అనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ వైసీపీ వాళ్లను తిట్టారు. వైసీపీ మంత్రులు తిరిగి పీకేపై ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత జనసేనాని ట్వీట్లతో ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. అందుకు మంత్రి పేర్ని నాని సైతం ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. అక్కడితే మాటలకు మాట చెల్లు. కథ ముగిసిపోయింది అనుకున్నారంతా. కానీ, మధ్యలో పానకంలో పుడకలా పోసాని ఎంటరై ఇష్యూను రచ్చ రచ్చ చేశారు. ఇలా సడెన్‌గా పోసాని ఊడిపడటం, పీకేపై తిట్లపై విరుచుకుపడటం, బూతులతో కంపు కంపు చేయడం.. అంతా వైసీపీ వ్యూహంలో భాగమేననే అనుమానం. ఎలాగంటే....
మొదట సోమవారం తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టి పవన్‌కల్యాణ్ జగన్‌ను తిట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని. కాస్త అటూఇటూగా ఓ మాదిరి నోటికి పని చెప్పారు. పోసాని ఎంటర్ చేసి.. టాపిక్‌ను వాళ్లిద్దరి వైపు డైవర్ట్ చేయాలనేది వైసీపీ స్కెచ్ అంటున్నారు. కానీ, సోమవారం ఆ డ్రామా అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. పవన్ నుంచి కానీ, ఆయన ఫ్యాన్స్ నుంచి పెద్దగా రియక్షన్ రాలేదు. దీంతో.. ఇలా అయితే కుదరదనుకున్నారో ఏమో.. మంగళవారం మరోసారి పోసానితో ప్రెస్‌మీట్ పెట్టించారు. కానీ, ఈసారి వెన్యూ మార్చేశారు. పోసాని ఇంట్లో బదులు, అందరికీ తెలిసేలా.. అందరూ ఈజీగా వచ్చేలా.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు లొకేషన్ షిఫ్ట్ చేశారు. రెండోరోజు మరింత ఘాటుగా, బండ బూతులతో పోసాని విరుచుకుపడేలా ఎత్తుగడ వేశారు.
పోసాని లైవ్ లో మాట్లాడుతుండగా.. ఆయన తిట్టే తిట్లు భరించలేక.. జనసేన యూత్ కార్యకర్తలు పోసానిపై దాడి చేసేందుకు ప్రెస్ క్లబ్‌కు పెద్ద ఎత్తున వచ్చారు. పోసానిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి పీకే ఫ్యాన్స్‌ను కట్టడి చేయడంతో పోసాని బతికిపోయారు. ఇదే వైసీపీకి కావలసింది. పోసానిపై దాడి చేసేలా జనసేనను ఉసిగొల్పడమే వైసీపీ వ్యూహం అంటున్నారు. నాదేండ్ల చెప్పినట్టు.. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహాలు వేసారని అనుమానిస్తున్నారు.
అయితే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే.. మొదటి రోజు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. రెండోరోజున మాత్రం అందుకు భిన్నంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు ఎందుకు వచ్చినట్లు? ఇంట్లో కాకుండా పబ్లిక్‌కు అందుబాటులో ఉండే ప్లేస్‌లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినట్లు? దీని వెనుక వైసీపీ స్కెచ్ దాగుందని అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ను, జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకే పోసాని కావాలనే రెండోరోజు ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టారని అనుమానిస్తున్నారు. పోసాని ఇల్లు.. ఐటీ కారిడార్‌లోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటుంది. అక్కడ హై సెక్యురిటీ ఉంటుంది. తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ను ఎన్ని తిట్టినా.. అక్కడకు వచ్చి ఆందోళన చేయడం పీకే ఫ్యాన్స్‌కు అంత ఈజీ కాదు. కాస్త కష్టమైన పని. అందుకే.. వారికి అంతగా కష్టపెట్టకుండా.. చాలా సులువుగా తనపై దాడి జరిగేలా.. ఇష్యూను మరింత రక్తి కట్టించి.. హాట్ హాట్‌గా మార్చేలా.. ప్రెస్‌మీట్ లొకేషన్‌ను తన ఇంటి నుంచి ప్రెస్‌క్లబ్‌కు మార్చారు పోసాని. అందుకే, జనసేన ప్రధాన నేత నాదేండ్ల మనోహర్ అలాంటి ఆరోపణ చేశారని అంటున్నారు. నాదేండ్ల అన్నట్టు.. వైసీపీ నేతలు పనికిమాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి.. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహం వేసిన మాట నిజమే అనిపిస్తోందని అంటున్నారు.