టాప్ న్యూస్ @ 1PM
posted on Sep 29, 2021 @ 12:25PM
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్ రాగానే.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. జనసేన, వైసీపీ మధ్య రచ్చ రగులుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తుండటం కాక రేపుతోంది.
--------
స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం పవన్‌పై దూషణ పర్వంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులు జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు నారాయణ స్వామి.
--------
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను నడపాల్సింది బ్యాంకులా లేక రాష్ట్ర ప్రభుత్వమా అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు కేంద్ర నిధుల తాకట్టుతో మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కోసం బ్యాంకులను అప్పు అడగడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా డైవర్షన్ చేశారని ఆరోపించారు. ప్రతి కేంద్ర పథకానికి ప్రత్యేక ఖాతా తెరవాల్సినా, కేవలం 5 ఖాతాలతో మేనేజ్ చేయడం సూట్ కేస్ కంపెనీల నిర్వాహణ లాంటిదేనని మండిపడ్డారు.
------
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు అన్నీ పరిశీలిస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. గత ఎన్నికల్లో కాపులు తటస్థంగా ఉన్నారని...కాపులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే దేనికి దారితీస్తాయో చెప్పలేమని తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విని బయటకు పంపడం, అవంతిపై హనీ ట్రాప్ చేయడం, సామినేని ఉదయభాను ప్రతిష్ట దెబ్బ తీయడం జరిగిందన్నారు.
-----
తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు.
-------
విశాఖలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లా అతలాకుతలం అయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. ఎయిర్ పోర్ట్‌లోకి నీరు రావడంతో...ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ రూపురేఖలు మార్చేస్తామని అన్నారు..ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని జేవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.
-------
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెరిగిపోతున్న గంజాయి దందాపై తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకప్పుడు పంజాబ్‌లో ఎలాంటి దందా జరిగిందో ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి దందా జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విజయశాంతి ప్రశ్నించారు.కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి గంజాయి మత్తు నుంచి యువతరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిదన్నారు.
----
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో గల ఎస్‌బీఐ బ్యాంక్ ముందు దళితుల క్యూ కట్టారు. తమ అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యాయో లేదో అని లబ్దిదారులు తనిఖీలు చేసుకుంటున్నారు. కొందరికి డబ్బులు అకౌంట్‌లో జమ అయినట్లు మెసేజ్‌లు రాగా...మరికొందరికి మెసేజ్ రాకపోవడంతో లబ్ధిదారులు బ్యాంక్‌కు తరలివచ్చారు.
--------
దేశం కోసం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో ప్రాణాలర్పించారని ఒక్క బీజేపీ నేత కూడా ఈ జాబితాలో లేడని ప్రతిపక్షనేత సిద్దరామయ్య పేర్కొన్నారు. బ్రిటీష్ వారికి గతంలో తొత్తులుగా వ్యవహరించి, నేడు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న బీజేపీ నుంచి దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నారు. బీజేపీ నేతల మనిస్థితిని తాను తాలిబాన్లతో పోల్చానని గట్టిగా సమర్థించుకున్నారు.
---------
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వతేదీ వరకు ఢిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడాన్ని నిషేధించింది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం ఢిల్లీలో వాయికాలుష్యాన్ని నివారించేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం విధించినట్లు సర్కారు తెలిపింది. శీతాకాలంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు.
------