కొండా పోటీలో లేనట్టేనా? రేవంత్‌రెడ్డి వ్యూహం మార్చారా?
posted on Sep 29, 2021 @ 12:58PM
రాజకీయం ఏ రోజుకు ఆ రోజు మారిపోతుంటుంది. ఇవాళ కరెక్ట్ అనుకున్నది.. రేపు రాంగ్ కావొచ్చు. అలానే రాంగ్ సైతం రైట్ అవ్వొచ్చు. రాజకీయమంటే అదే. కొన్నిసార్లు నెగ్గినా ఓడినట్టే. మరొకొన్నిసార్లు తగ్గినా నెగ్గినట్టే. కాంగ్రెస్‌కు హుజురాబాద్ ఎన్నిక అలానే కానుందా?
కౌశిక్‌రెడ్డి గోడ దూకాక.. హస్తం పార్టీకి బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. హుజురాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారంటూ మొదట్లో లీకులొచ్చాయి. పొన్నం తర్వాత అనూహ్యంగా కొండా సురేఖ పేరు తెరమీదికొచ్చింది. కొండంత బలమున్న కొండా అయితేనే.. రేసుగుర్రంలా హుజురాబాద్‌ను గెలుచుకొస్తుందని భావించారు. రేపోమాపో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తారంటుండగా.. సడెన్‌గా జాబితాలో కొండా సురేఖ పేరు లేదంటూ ప్రచారం జరుగుతోంది. నిజంగా కొండా సురేఖ బరి నుంచి తప్పుకున్నారా? లేక, తప్పించారా? వ్యూహాత్మకమా? ఉద్దేశ్యపూర్వకమా? ఇలా అనేక అనుమానాలు.
తాను హుజురాబాద్‌లో పోటీ చేయాలంటే.. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి టికెట్లు కేటాయించాలనేది కొండా ఫ్యామిలీ పెట్టిన డిమాండ్లు. అయితే, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సో, వరంగల్, పరకాల స్థానాల్లో తామే పోటీ చేస్తామంటూ కొండా దంపతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో కాంగ్రెస్‌కూ పెద్దగా అభ్యంతరం లేదు. గెలిచే సత్తా ఉన్న నాయకులు కావడంతో ఆ రెండు సీట్లూ ఇచ్చేందుకు పార్టీ సై అంటోంది. అయినా, కొండా సురేఖ హుజురాబాద్ నుంచి పోటీ చేయట్లేదనే వార్తలు వస్తుండటం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది.
నిస్సందేహంగా కొండా బలమైన కేండిడేటే. కానీ, హుజురాబాద్‌లో ఆమె గెలుస్తారా? అంటే సందేహమే. కేవలం పోటీ చేయడానికి, పోటీ ఇవ్వడానికి మాత్రమే అయితే.. కొండా లాంటి స్ట్రాంగ్ లీడర్‌ను అనవసరంగా బరిలో దింపి వారి ఇమేజ్‌ను తగ్గించడం ఎందుకనేది రేవంత్‌రెడ్డి ఆలోచన అంటున్నారు. అందులోని హుజురాబాద్ స్థానిక నాయకత్వం కొండా పేరును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. స్థానికంగా సమర్థుడైన నాయకుడిని ఇప్పటి నుంచే రెడీ చేస్తే.. ప్రస్తుత ఉప ఎన్నికలో కాకపోయినా నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల నాటికైనా గెలిచేలా బలం పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. అది కూడా కరెక్టే. అందుకే.. అధిష్టానానికి పంపిన తాజా జాబితాలో కొండా సురేఖ పేరు లేదని అంటున్నారు. లేటెస్ట్ లిస్ట్‌లో.. క్రిష్ణారెడ్డి.. రవికుమార్.. ప్యాట రమేశ్.. సైదులు పేర్లు ఉన్నట్టు సమాచారం.
కాంగ్రెస్‌కు ఎలాంటి ఉపయోగం లేని హుజురాబాద్ ఉపపోరులో.. పొన్నం, కొండాలాంటి పెద్ద స్థాయి నేతల్ని బరిలోకి దింపి భంగపడే కన్నా.. పోటీ చేశామా? అంటే చేశామనేలా అనిపించేలా.. ఉంటే చాలనే అభిప్రాయంలో రేవంత్‌రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. బలమైన నేతల్ని బరిలోకి దింపినా.. ఆస్థాయిలో ఓట్లు రాకపోతే.. అది పార్టీకి మరింత చేటు చేస్తుందని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు. అందుకే, కేసీఆర్-ఈటల మధ్య సాగే హుజురాబాద్ కొట్లాటలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేయి పెట్టకుండా.. చేయి కాల్చుకోకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని.. కాస్త తగ్గి.. పరోక్షంగా నెగ్గాలనే ఎత్తుగడ అమలు చేయనుందని తెలుస్తోంది. ముందు పొన్నం, కొండా అంటూ కావాలనే హడావుడి చేసి.. టీఆర్ఎస్, బీజేపీలకు అలా ఝలక్ ఇచ్చి.. తుదకు స్థానికుల్లో ఎవరో ఒకరిని బరిలో దింపి.. ఈవీఎంలో చేతి గుర్తు ఉండేలా చూసుకోవడం మినహా.. హుజురాబాద్ ఎన్నికకు అంతకుమించి ప్రాధాన్యం ఇవ్వకూడదనేది పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యూహంలా కనిపిస్తోంది.