ఎమ్మెల్యేను సింహంతో పోల్చుతూ పొగడ్తలు.. అనంతలో బరి తెగిస్తున్న పోలీసు అధికారులు!
posted on Sep 29, 2021 @ 2:42PM
అనంతపురం జిల్లాలో పోలీసు అధికారులు బరి తెగిస్తున్నారు. బహిరంగంగానే అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోస్టుల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి.. వైసీపీ నేతల మత్తులో జోగుతున్నారు. తాజాగా గుత్తి సీఐ రాము.. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సింహంతో పోల్చుతూ పొగడ్తల్లో ముంచెత్తడం రచ్చగా మారింది. ‘‘మన ఎమ్మెల్యే సింహంలాంటోడు. ఎవరికి ఎలాంటి సాయం చేయాలో మన ఎమ్మెల్యే సార్ చేస్తాడు. అడగక పోయినా సాయం చేసే వాడే లీడర్’’ అంటూ ఓ రేండ్ పొగిడేశారు. సీఐ రాము తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్‌లా కాకుండా అధికార పార్టీ కార్యకర్తలా సీఐ రాము మారిపోయారని జనాలు మండిపడుతున్నారు.
ఇక తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము వ్యవహారం వివాదాస్పమవుతోంది. డీఎస్పీ, సీఐ తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు. ఇలాంటి అడ్డమైన దారులు తొక్కే వారి మాటలు విని అందర్నీ ఇబ్బంది పెడుతూపోతే వ్యవస్థ నాశనం అవుతుందని లేఖలో ఎస్ఐ రాయడం దుమారం రేపుతోంది.
ఉన్నతాధికారులు నిజాయితీగా పనిచేసేవారిని ప్రోత్సహించాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నారు. యూనిఫాం తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసే వారిని సపోర్ట్ చేస్తే తమ కుటుంబాలకు సమాజానికి పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డ్‌గా కూడా పనికి రాని గుత్తి సీఐ రామును తమ కులానికి చెందినవారని సపోర్ట్ చేయడం నేరం సార్ అంటూ లేఖలో ఘాటుగా నిలదీశారు ఎస్ఐ సుధాకర్. ‘‘నన్ను సస్పెండ్ చేసినా... నేను కట్టిన 36 కేసులకు 36 ఛార్జ్ మెమోలు ఇచ్చినా గర్వంగానే ఉంటాను’’ అంటూ తాడిపత్రి డిఎస్పీ చైతన్యనుద్దేశించి ఎస్సై సుధాకర్ యాదవ్ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనం రేపుతోంది. పోలీస్ శాఖను షేక్ చేస్తోంది.