ఏపీ డ్రగ్స్ దందా వెనుక బిగ్‌బాస్? డీఆర్ఐ విచారణలో సంచలనాలు...
posted on Sep 29, 2021 @ 4:18PM
డ్రగ్స్. డ్రగ్స్. డ్రగ్స్. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 21 వేల కోట్ల విలువైన హెరాయిన్. అది కూడా ఆప్ఘనిస్తాన్ నుంచి మన విజయవాడ అడ్రస్‌తో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దందా జరుగుతోందంటే మాటలా? ఆ న్యూస్ తెలిసి యావత్ రాష్ట్రం ఒక్కసారిగా షాక్ అయింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరిన్ని షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
ఎక్కడో ఆప్ఘనిస్తాన్ నుంచి రవాణా అయి గుజరాత్ ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుకుని.. ఆ తీగ లాగితే ఇక్కడ ఏపీలో భారీ డ్రగ్స్ డొంక కదులుతోంది. ఆ తీగ అటుతిరిగి ఇటుతిరిగి వైసీపీ పెద్దల మెడకు చిక్కుకుంటోంది. ఆ చిక్కుల నుంచి బయటపడేసేందుకు పోలీసులు తమవంతు సాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా కొన్నిరోజులుగా సాగుతున్న ఆపరేషన్ డ్రగ్స్ ఎపిసోడ్‌లో లేటెస్ట్‌గా కాకినాడ పోర్టు తెరపైకి రావడం.. సముద్రపు డాన్ పేరు వినిపిస్తుండటం.. ఆ లింకులు వైసీపీ ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతుండటం.. ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌గా, సుకుమార్ సినిమా స్క్రీన్‌ప్లే తరహాలో నడుస్తోంది ఏపీ డ్రగ్స్ యవ్వారం.
తాలిబాన్ టూ తాడేపల్లి.. డ్రగ్స్ దందా వెనుకున్న బిగ్‌బాస్ ఎవరు? ఇలా కొన్నిరోజులుగా ఏపీని డ్రగ్స్ ఎపిసోడ్ కుదిపేస్తోంది. కేసును తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కేంద్ర అధికారులు టాల్కమ్ పౌడర్ ముసుగులో దిగుమతి అవుతున్న హెరాయిన్‌ను భారీ స్థాయిలో పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ దిగుమతి.. విజయవాడ చిరునామాతో ‘ఆశి ట్రేడింగ్ కంపెనీ’ పేరుతో మాచవరపు సుధాకర్ ద్వారా జరిగినట్టు గుర్తించారు.
ముంద్రా పోర్టులో డ్రగ్స్ స్వాధీనం అనంతరం కేంద్ర సంస్థలు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, గాంధీధామ్, మాండ్వి, విజయవాడలో తనిఖీలు చేపట్టారు. కన్‌సైన్‌మెంట్ రవాణాకు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కోడ్ అందించిన లైసెన్స్ హోల్డర్ మాచవరపు సుధాకర్, ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే, ఇంత పెద్ద డ్రగ్స్ రాకెట్ లింకులు తాజాగా కాకినాడ పోర్టు వైపు దారి తీస్తున్నాయి. ఈ హెరాయిన్ సరఫరాకు కాకినాడతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.. సడెన్‌గా సముద్రపు డాన్ గా చెప్పుకునే మహ్మద్ షేక్ అలీషా పేరు తెరమీదకు రావడం ఆసక్తికరంగా మారింది.
అశి ట్రేడింగ్ కంపెనీతో పాటు కాకినాడ పోర్టులోనూ ఆ డాన్ అలిషా లింకులు బయటపడుతున్నాయి.. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితుడికి ఈ వ్యవహారంలో సంబంధం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. అసలు మహ్మద్ షేక్ అలీషా.. సముద్రపు డాన్‌గా ఎలా ఎదిగాడు? వేల కోట్ల ఇంటర్నేషనల్ డ్రగ్స్ బిజినెస్ చేసేంత నెట్‌వర్క్ ఎక్కడిది? అతనికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? అతని వెనుక ఎవరున్నారు? అలిషాకు వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం ఉంది? మాచవరం సుధాకర్ కు దీనికి లింకు ఏంటీ? ఇలా అనేక ఆసక్తికర ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మహ్మద్ షేక్ అలీషాకు చెందిన శాన్ మెరైన్ అనే కంపెనీలో మాచవరం సుధాకర్ గతంలో పని చేశాడని తెలుస్తోంది.. అలిషా ఆదేశాల ప్రకారమే అశి ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటైందని అంటున్నారు.. తెర మీద తన పేరు ఎక్కడా వినిపించకుండా అలిషా చాలా తెలివిగా వ్యవహరించాడని... సుధాకర్ ను ముందుంచి అతనితో కంపెనీ పెట్టించి డ్రగ్స్ దందా నడించాడని తెలుస్తోంది.
ముంద్రా పోర్టులో దొరికిన 21వేల కోట్ల విలువైన హెరాయిన్.. గుజరాత్ ముద్రా పోర్టు నుంచి వయా మచిలీపట్నం పోర్టు మీదుగా విజయవాడకు రవాణా బుక్కైనట్లు డాక్యుమెంట్లలో ఉందని తెలుస్తోంది.. నిజానికి మచిలిపట్నం పోర్టులో ఎగుమతులు , దిగుమతు లేవు.. మచిలిపట్నం పోర్టు పేరుతో కంటైనర్లు తెచ్చి.. వాటిని కాకినాడ పోర్టులో దిగుమతి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ గోల్‌మాల్ వ్యవహారమంతా డాన్ అలిషా డైరెక్షన్ లో జరుగుతుందని అంటున్నారు... గుజరాత్ నుంచి కాకినాడ.. కాకినాడ నుంచి విజయవాడ.. అక్కడి నుంచి ఏపీ వ్యాప్తంగా.. అలా దేశమంతా డ్రగ్స్ రవాణా అవుతున్నట్టు సమాచారం. ఇక కాకినాడ పోర్టు నుంచే విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. కాకినాడ పోర్టు అడ్డాగా సాగుతున్న డ్రగ్స్ దందా అంతా ఓ వైసీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతోందని చెబుతున్నారు.
కాకినాడ పోర్టులో మెరైన్ కంపెనీలో అలిషా గతంలో ఆఫీస్ బాయ్‌గా పని చేశారు. ఆ తర్వాత డాన్‌గా ఎదిగాడు. ప్రస్తుతం శాన్ మెరైన్ సహా పలు కంపెనీలకు ఓనర్.. అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే అతను అంతలా ఎదిగాడని.. వ్యాపారాలు విస్తరించాడని అంటున్నారు... లేకపోతే వేల కోట్ల విలువైన డ్రగ్స్ రవాణా.. ప్రభుత్వ పెద్దల సాయం లేకుండా ముందుకు సాగదు. అందుకే, డ్రగ్స్ దందా వెనుకున్న బిగ్‌బాస్ ఎవరో తేలాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఇక పోలీసుల తీరుపైనా చాలా విమర్శలు వస్తున్నాయి. హెరాయిన్ పట్టుబడిన 24 గంటల్లోనే.. సరైన విచారణ జరగకుండానే పోలీసులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టడం ఎవరిని కాపాడటానికో అర్థం కావట్లేదని అంటున్నారు. డ్రగ్స్ కేసును డీఆర్ఐ విచారణ చేస్తుండగా.. విజయవాడ సీపీ ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చినట్టు..? డ్రగ్స్ రవాణాకు విజయవాడతో సంబంధం లేదు, కేవలం కంపెనీ మాత్రమే ఇక్కడ రిజిస్టర్ అయిందని ముందే ఎలా చెబుతారు..? విచారణ జరుగుతుందని చెబుతూనే.. విజయవాడకు సంబంధం లేదని ఎలా కన్ క్లూజన్ కు వస్తారు..? సీపీ, డీజీపీ....ప్రకటనల్లో విరుద్దమైన అంశాలు ఎందుకు ఉన్నాయి..? రాజకీయ నేతల గురించి డీజీపీ మాట్లాడటం ఏంటీ..? డీఆర్ఐ ఉండగా డీజీపీ స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది..? సమాచారం లేకుండా.. విచారణ సాగుతుండగానే... ప్రకటనలు చేయవచ్చా..? అలా ముందస్తు స్టేట్‌మెంట్స్ ఇవ్వడం ఎవరిని కాపాడటానికి? ఏ పెద్దల ఆదేశాలతో అలా చేస్తున్నారు? ఇలా అనేక ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు వినిపిస్తున్నాయి.
పోలీసుల తీరు వల్లే డ్రగ్స్ , గంజాయి రవాణాకు ఏపీ అడ్డాగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం డ్రగ్స్ దందాలో.. సముద్రపు డాన్ మహ్మద్ షేక్ అలీషా కీలక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇక డ్రగ్స్ సరఫరాకు కాకినాడ పోర్టుతో లింకులు బయటపడుతున్నాయి. అశి ట్రేడింగ్ వ్యవహారం.. సుధాకర్ పాత్ర.. డ్రగ్స్ దందాతో వైసీపీ నేతల సంబంధాలు.. అండదండలు.. మచిలిపట్నం పోర్టు పేరుతో కాకినాడ పోర్టులో ట్రాన్స్ పోర్టు.. ఇలా అనేక విషయాలు నిగ్గు తేలాల్సి ఉంది. ఆ గుట్టు బయటపడాలంటే.. డీఆర్ఐ విచారణకు, కేంద్ర సంస్థలకు ఏపీ పోలీసులు సహకరించాలి. సున్నితమైన, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో పోలీసుల నిస్పక్షపాతంగా వ్యవహరించాలి. డ్రగ్స్ డొంక వెనుకున్న పెద్దల పాత్ర బయటపెట్టాలి. ఆ గుట్టు రట్టు అయితేనే గానీ.. అసలు డ్రగ్స్ దందా వెనుకున్న బిగ్‌బాస్ ఎవరో బయటకు వచ్చేది.