TOP NEWS @ 7pm
posted on Sep 29, 2021 @ 7:02PM
1. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం పుష్కలంగా ఉన్నాయి. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
2. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి నానితో పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని.. చిరంజీవి సైతం తనతో విచారం వ్యక్తం చేశారని చెప్పారు పేర్ని నాని.
3. దళిత బంధు లాంటి పథకాలు కాదు.. దళితుల వర్గీకరణ కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఎంత కీలకమైందో.. ఎస్సీ వర్గీకరణ కూడా అంతే కీలకమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు పెడితే కాంగ్రెస్ తరఫున మద్దతిస్తామన్నారు. కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగను రేవంత్‌రెడ్డి పరామర్శించారు.
4. లోటస్ పాండ్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలతో ప్రశాంత్ కిశోర్ టీమ్ సభ్యులు సమావేశమయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఇకపై షర్మిల పార్టీ కార్యక్రమాలు పీకే వ్యూహరచనలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.
5. ఎయిడెడ్ పాఠశాలలను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వెంటనే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వలన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో విద్యా చట్టం నిబంధనలకు వ్యతిరేకమని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
6. డ్రగ్స్ రవాణా విషయంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విచారించాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు. డ్రగ్స్ రవాణాకు కాకినాడ పోర్టు కేంద్రంగా మారిందనే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మహ్మద్ ఆలిషాకు వైసీపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయని కనకమేడల ఆరోపించారు.
7. ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి వందల ఐటీ కంపెనీలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎల్ఎఫ్ రెండో యూనిట్ హైదరాబాద్ రాకుండా కేటీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేతకాని తనంతోనే అతిపెద్ద ఐటీ కంపెనీ వేవ్‌రాక్ హైదరాబాద్‌ను వీడిందని తెలిపారు.
8. టీటీడీ కేసు విచారణలో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరిని ఉపేక్షించరన్నారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదనే పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వారంలోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ లాయర్‌కు ధర్మాసనం అవకాశం ఇచ్చింది.
9. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌పై మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ ఘాటైన విమర్శలు చేశారు. ప్రకాష్ రాజ్ ఒక్కసారైనా మా ఎన్నికల్లో ఓటేశారా? ఒక్క మా మీటింగ్‌కైనా అటెండ్ అయ్యారా? ఎన్నిసార్లు మా నుండి సస్పెండ్ అయ్యారో చెప్పాలి? పోటీకి మీరే వచ్చారా? ఎవరైనా తెచ్చారా? అని ప్రశ్నించారు నరేశ్.
10. కాంగ్రెస్ పార్టీకి సారథి లేరని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తనకు తెలియదన్నారు. కేంద్రంలో కూర్చున్న 20 మందితో ప్రజాస్వామ్యం కొనసాగదని వ్యాఖ్యానించారు. పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభంలో పడిన నేపథ్యంలో కపిల్ సిబల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.