టమోటా కొనేటట్టు లేదు.. ఉల్లి తినేటట్టు లేదు.. ఏందిరో ఈ రేట్లు!
posted on Oct 14, 2021 @ 12:07PM
ఏ కూర వండాలన్నా ఉల్లి మస్ట్. ఏ కూర లేకపోతే.. టమోటా కూర ది బెస్ట్. కర్రీ క్వాంటిటీ పెరగాలన్నా.. ఏ కూరకు టేస్ట్ రావాలన్నా.. నాలుగు టమోటాలు పడేస్తే సూపర్. అందుకే, కూరగాయలందు టమోటా ప్రత్యేకతే వేరు. ఇక ఉల్లి గురించి చెప్పనవసరమే లేదు. అందుకే టమోటా, ఉల్లిలు అందరికీ అత్యవసరం. అలాంటి టమోటా ఇప్పుడు ధరలో మోత మోయిస్తోంది. 20 రూపాయలు పెడితే కిలో టమోటా ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు 60-70 చెబుతున్నారు. బేరమాడే పరిస్థితి లేదు. ఇష్టముంటే తీసుకో లేదంటే లేదంటూ కసురుతున్నారు. ఇక, ఇంకో టమోటా కొసరడిగితే కొట్టేసేలా ఉన్నారు. ఒకప్పుడు ఉల్లికి ఈ తరహా డిమాండ్ ఉండేది.. ఇప్పుడు ఉల్లితో పాటు టమోటా కూడా కాస్ట్లీ వెజిటబుల్...
మన దగ్గరనే కాదు.. దేశవ్యాప్తంగా టమోటా రేట్ తారాజువ్వలా ఎగిసింది. ఢిల్లీలో కిలో 72 రూపాయలు. కోల్‌కతాలో కూడా అంతే. చెన్నై, ముంబైలో 60కి అటూఇటూ అమ్ముతున్నారు. ఇక తెలుగురాష్ట్రాల్లోనూ సుమారు రూ.60 వసూలు చేస్తున్నారు. ఉల్లి ధర కూడా టమోటా రేటు చుట్టూనే తిరుగుతోంది. కిలో ఉల్లి రూ.60 పలుకుతోంది.
టమోటా ఎక్కడ పండినా.. వాటిని స్థానిక మార్కెట్లతో పాటు దేశవ్యాప్తంగా రవాణా చేస్తుంటారు. డిమాండ్‌ను బట్టి.. ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే.. అక్కడికి తరలించి అమ్ముతుంటారు. కానీ, ప్రస్తుతం దేశంలో ఏ పెద్ద నగరంలో చూసుకున్నా.. టమోటా రేటు ఒకేలా ఉంది. మెట్రో సిటీస్‌లో 70 దాటేసింది. ఇంకా మనదగ్గరే కాస్త బెటర్. 60కి దగ్గరగా అమ్ముతున్నారు. పండుగ సమయంలో టమోటా రేట్లు పెరగడంతో ఖర్చు మరింత పెరుగుతోంది. పేదలు, మధ్యతరగతికి టమోటా కర్రీని తగ్గించుకుంటున్నారు.
ఇంతకీ టమోటాలకు ఇంతలా ధర ఎందుకు పెరిగిందో తెలుసా? ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమోటా పంటంతా నాశనమైంది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో.. అన్నిచోట్ల పంట నష్టం జరిగింది. వానలో, వరదలో, బురదలో టమోటా మొక్కలు పాడయ్యాయి. సో.. ఉత్తత్తి లేక.. ధర సెంచరీ దిశగా దూసుకుపోతోంది.