హెటిరోలో దొరికిన డబ్బంతా జగన్ దేనా?
posted on Oct 14, 2021 @ 6:07PM
తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖమైన హెటిరో ఫార్మా సంస్థల్లో జరిగిన ఐటీ సోదాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. నాలుగు రోజులుగా హెటిరో ఫార్మా కార్యాలయాలు, యూనిట్లు, కంపెనీ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు. రూ. 142 కోట్ల నగదు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో సహ నిందితుడిగా ఉన్న హెరిటో ఫార్మా చైర్మన్ బండి పార్ధసారధి రెడ్డికి సంబంధించి చీకటి కోణాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.
6 రాష్ట్రాల్లో హెటిరో సంస్ధల్లో 60 చోట్ల 4 రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. బీరువాల నిండా రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి. నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్ చేశారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ. 142 కోట్లు దాచారని అధికారులు వెల్లడించారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని తెలిపారు. ఒక్కో అల్మారాలో రూ. 5 కోట్ల నగదు దాచారని తెలిపారు. బీరువాల్లో లబించిన డబ్బుల కట్టలు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. బోరబండలో హెటిరో రహస్య స్థావరంగా భావిస్తున్న డెన్‌లోనే ఏకంగా రూ.142.87 కోటమ్ల నగదు కట్టల రూపంలో బయటపడిందని తెలుస్తోంది.
హెటిరో సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో దీనిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. రాజకీయ నేతలకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. రూ. 147 కోట్లు కాదని ఇంకా వేల కోట్లలో దాచారన్నారు. ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనన్నారు. సీఎం జగన్ మల్లె పూలు కూడా అమ్ముకుంటారని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
విశాఖలో వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఏ ప్రజలు అయితే అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారో.. అదే ప్రజలు కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. జైల్లో చిప్ప కూడు తిన్నవారికి పాలనపై అవగాహన ఏం ఉంటుందన్నారు. ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు మద్యం చాటున ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సీఎం యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.