కారును పోలిన సింబల్స్.. కేసీఆర్ కు హుజురాబాద్ టెన్షన్
posted on Oct 14, 2021 @ 1:09PM
హుజురాబాద్ ఉప ఎన్నికను పోటీలో ఉన్న ప్రధాన పార్టీలతో పాటుగా, పోటీలో లేని పార్టీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రజా సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే రాజకీయాలతో ప్రత్యక్ష పరోక్ష సంబందాలున్న ప్రతిఒక్కరిలో, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎప్పుడూ, ఎక్కడ లేని విధంగా, ఒక్క ఉపఎన్నికకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. ‘ఫ్యామిలీకి పది లక్షలు ... ఇంటికి పదివేలు’ ఇలా డబ్బును వెదజల్లుతున్నారని, అంటున్నారు. ఇక మద్యం విషయం అయితే, చెప్పనే అక్కర లేదు, హుజూరాబాద్ ..పేరు హుజూరా ‘బార్’ గా మారిపోయిందని అంటున్నారు.
ఇంత చేసినా ఎందుకనో అధికార పార్టీలో ఇంకా గెలుస్తామనే విశ్వాసం కలుగుతున్నట్లు లేదు .. అందుకే కావచ్చును లేదంట చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే విజ్ఞతతో కావచ్చును, నామినేషన్ల ఘట్ట్టం ముగిసి, ఉపఎన్నిక పోలింగ్ పక్ష రోజుల్లోకి వచ్చినా, అధికార పార్టీ ఇప్పటికే వేట కొనసాగిస్తూనే ఉంది.ఇతర పార్టీల చిన్నా చితక నాయకుకులతో బేర సారాలు సాగిస్తూనే ఉందని అంటున్నారు. ముఖ్యంగా తెరాస ప్రధాన ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ అనుచరులను ఖరీదు కట్టి తమవైపుకు తిప్పేసుకుంటున్నారు. అందుకే, నిన్నటి దాకా ఈటల వెంట ఉండి ఆయనకు జై ..కొట్టిన నాయకులు, మంత్రి హరీష్ రావు వెంట తెరాస ప్రచారంలో పాల్గొంటూ కూడా.. ఈటలకు జై కొడుతున్నారు.
ఇంత చేసినా ఎంతగా దిగాజరినా, ఫలితం లేక పోవడం ఒకెత్తు అయితే, ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కొత్త సమస్యలు,తెరాస నాయకత్వం ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇదే క్రమమలో ఇప్పుడు ‘కారు’ పార్టీని ఆ గుర్తే కంగారుకు గురిచేస్తోంది. ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం ఎంపిక చేసిన ఉచిత చిహ్నాల (సింబల్స్) లో కారు గుర్తును పోలిన చిహ్నాలుఉండటంతో గులాబీ నేతల గుడెల్లో ఆ గుర్తులు పరుగులు తీస్తున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ముగిసిన తర్వాత 30 అభ్యర్ధులు బరిలో మిగిలారు, ఇదులో గుర్తులున్న పార్టీల అభుర్ధులు పది మంది ఉన్నారని అనుకున్నా, 20 మంది స్వతంత్ర అభ్యర్ధులున్నారు. స్వతంత్రులు లేదా గుర్తింపు పొందని పార్టీల తరపున పోటీ చేస్తున్న ఈ 20 మంది అభ్యర్థుల్లో చాలా మంది అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కారును పోలిన గుర్తులే కావాలని ఈసీని అభ్యర్థించారు. దీంతో కారు పార్టీకి గతం గుర్తుకు వస్తోంది.
గతంలో ట్రక్కు, రోడ్డు రోలర్, ట్రాక్టర్, ఆటో రిక్షా, , బస్సు, లారీ వంటివి టీఆర్ఎస్‌ను భారీ దెబ్బ కొట్టాయి. వాటి కారణంగా కొన్ని స్థానాల్లో మెజార్టీ పడిపోగా.. మరికొన్ని స్థానాల్లో ఏకంగా టీఆర్ఎస్ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం గతంలోనే ఉచిత చిహ్నాల జాబితా నుంచి ఆటో రిక్షా, ట్రక్, వంటి కొన్ని గుర్తులు తొలగించింది. అయినప్పటికీ మరికొన్ని గుర్తులు కారును పోలినవి అందుబాటులోనే ఉన్నాయి. దుబ్బాక ఉపఎన్నికలో ఇలాంటి గుర్తుల కారణంగా టీఆర్ఎస్ పరాభవం చూసింది. దుబ్బాకలో టీఆర్ఎస్ పై బీజేపీకి వచ్చిన మెజార్టీ కంటే.. కారును పోలిన సింబల్ వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా కారు గుర్తులను పోలిన వాటిని ఎన్నికల సంఘం ఆమోదించడంతో దుబ్బాక రిపీట్ అవుతుందని అధికార పార్టీ ఆందోళన చెందుతోందని, సమాచారం.