హైదరాబాదీలకు గుడ్ న్సూస్.. గణేష్ నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ లో కాలుష్యం తగ్గింది..
posted on Oct 14, 2021 @ 10:52AM
హైదరాబాదీలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ కాలుష్యం కాసారంగా మారింది. పాలకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సాగర్ మాత్రం క్లీన్ కావడం లేదు. ఇక ప్రతి ఏటా జరిగే గణేష్ నిమజ్జనోత్సవం తర్వాత హుస్సేన్ సాగర్ లో కాలుష్యం మోతాదు మరింత పెరుగుతుంది. అందుకే గణేష్ విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయవద్దంటూ పర్యావరణ ప్రేమికులు న్యాయ పోరాటం చేస్తుంటారు. కాని పూర్తి స్థాయిలో మాత్రం సాధ్యం కావడం లేదు.
అయితే ఇప్పుడు మాత్రం హుస్సేన్ సాగర్ కు సంబంధించి గుడ్ న్యూస్ హైదరాబాదీలకు వచ్చింది. హుసేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనం తర్వాత కాలుష్యం పెరుగుతుందనుకుంటే భారీగా తగ్గింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల హుసేన్‌సాగర్‌లో కాలుష్యం పెరుగుతుందని ఇటీవల పలువురు ఆందోళన వ్యక్తం చేసిన వేళ కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది గణేశ్ విగ్రహాల నిమజ్జనం తర్వాత హుసేన్‌సాగర్‌లో కాలుష్య స్థాయిని పరిశీలిస్తారు. గత ఏడాది కంటే హుసేన్‌సాగర్‌లో ఈ సారి కాలుష్యం భారీగా తగ్గిందని పీసీబీ స్పష్టం చేసింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ముందు, విగ్రహాల నిమజ్జనాలు జరిగిన రోజులతో పాటు ఆ తర్వాత హుసేన్‌సాగర్ నీటి నాణ్యతను పరిశీలించారు.ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, లేపాక్షి ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం తగ్గుముఖం పట్టిందని పీసీబీ తెలిపింది. ఇందుకు గణేశ్ నిమజ్జనం తర్వాత కురిసిన భారీ వర్షాలే కారణమని చెబుతున్నారు, అయితే, కరిగిన ఘనపదార్థాల మోతాదు పెరిగిందని పీసీబీ నివేదికలో వెల్లడైంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ తో పాటు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, భార లోహాల మోతాదు పెరిగాయి. గణేశ్ విగ్రహాల నిమజ్జనం తర్వాత భారీగా వర్షాలు కురవడంతో హుసేన్‌సాగర్‌లో భారీగా వరద నీరు చేరింది. దీంతో కాలుష్య స్థాయి తగ్గిందని అంచా వేస్తున్నారు.