వైసీపీకి ప్రచారం చేసినందుకు మోహన్ బాబు పశ్చాతాపం!
posted on Oct 14, 2021 @ 1:24PM
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా హీట్ కొనసాగుతూనే ఉంది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేసి సంచలనానికి తెర తీశారు. ఇక ఈనెల 16న మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారని భావించిన మంచు విష్ణు.. సడెన్ గా సాదాసీదాగా 13వ తేదీ బుధవారమే బాధ్యతలు చేపట్టారు. తర్వాత కూడా కీలక పరిణమాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చినందుకు నందమూరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
నందమూరి బాలకృష్ణను అతని నివాసంలో కలిసిన సందర్భంగా హీరో మోహన్ బాబు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ అల్లుడు లోకేశ్‌కు వ్యతిరేకంగా తాను మంగళగిరిలో ప్రచారం చేశానని, అయినప్పటికీ తన కుమారుడు విష్ణుకి బాలయ్య 'మా' ఎన్నికల్లో మద్దతుగా నిలిచారని మోహన్ బాబు అన్నారు. బాలకృష్ణ గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి అని చెప్పారు. మా భవనం విషయంలో విష్ణుకు తోడు ఉంటానని చెప్పారని అన్నారు. ఎన్టీఆరే తనను బాలకృష్ణ ఇంటి వద్దకు పంపించినట్లు ఉందని చెప్పారు.
గత ఎన్నికల్లో బాలయ్య అల్లుడి ఓటమికి ప్రచారం చేసినప్పటికీ.. అదేమీ ఆయన మనసులో పెట్టుకోలేదని మోహన్ బాబు చెప్పారు. విష్ణు బాబుకి తోడుగా ఉంటానని బాలకృష్ణ ఇప్పటికే చెప్పారని తెలిపారు. 'బాలకృష్ణకు నేను ఇటీవల ఫోను చేశాను.. మీరు ఎందుకు ఫోను చేశారు? అని అడిగారు. విష్ణు బాబుకే ఓటు వేస్తానని అన్నారు. అయినా, మీరు చెబితేనే నేను ఓటు వేస్తానా? అని వ్యాఖ్యానించారు' అని మోహన్ బాబు చెప్పారు.
బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని అన్నారు మంచు విష్ణు.'మా' ఎన్నికల్లో మొదటి నుంచి బాలకృష్ణ తనకు సహకరించారని తెలిపారు. ఇప్పటికే తాను కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్ లాంటి వారిని కలిశానని చెప్పాడు. ఇప్పుడు బాలయ్యను కలిశానని వివరించారు. పెద్దలందర్నీ కలుస్తానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు మంచు విష్ణు.