బతుకమ్మ వేడుకలకు కవిత డుమ్మా.. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదా?
posted on Oct 13, 2021 @ 8:21PM
కల్వకుంట్ల కవితకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదా? కేటీఆర్ తో ఆమెకు విభేదాలు మరింత తీవ్రమయ్యాయా? ఈ చర్చ తెలంగాణలో కొన్ని రోజులుగా సాగుతోంది. అన్న కేటీఆర్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత కనిపించిన సందర్భాలు కూడా ఇటీవల కాలంలో కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. రాఖి పౌర్ణమి రోజున జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టకపోవడం చర్చగా మారింది. ప్రతి ఏటా అన్నకు రాఖీ కట్టి సందడి చేసేది కవిత. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవి. కాని ఈసారి కవిత రాఖీ కట్టకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ భారీగా పెరిగిందనే చర్చ వచ్చింది. ఈ వార్తలను ఇద్దరు కూడా ఖండించకపోవడంతో నిజమేనని అందరూ భావించాల్సి వచ్చింది.
కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన కవిత.. గత రెండు వారాలుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో బిజీగా గడిపారు. ఈసారి జాగృతి తరపున ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో హై రేంజ్లో బతుకమ్మ సాంగ్ రూపొందించారు కవిత. ఆ సాంగ్ ఆవిష్కరణను కూడా ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పలు వేడుకలకు హాజరవుతున్నారు కవిత. మంగళవారం పీపుల్స్ ప్లాజా లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆడి పాడారు.
బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కల్వకుంట్ల కవిత... బుధవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాత్రం కనిపించలేదు. ప్రగతి భవన్ లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాని కేసీఆర్ కూతురు కవిత మాత్రం హాజరుకాలేదు. గతంలో ప్రగతి భవన్ లో నిర్వహించిన వేడుకల్లో అంతా తానై వ్యవహరించేవారు కవిత. అలాంటిది ఈసారి ప్రగతి భవన్ కు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేకపోవడం వల్లే బతుకమ్మ వేడుకలకు కవిత వెళ్లలేదని అంటున్నారు. గత కొన్ని నెలలుగా కవిత ముఖ్యమంత్రి నివాసానికి రావడం లేదంటున్నారు. కవిత ప్రగతి భవన్ కు ఎందుకు రావడం లేదన్నదానిపై పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తండ్రి కేసీఆర్ తో విభేదాలున్నాయా లేక అన్న కేటీఆర్ తో గ్యాప్ వచ్చిందా అన్నదానిపై రకరకాల చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి మార్పు విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరిగాయని గతంలో ప్రచారం జరిగింది. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావించగా.. కవిత తీవ్రంగా వ్యతిరేకించారనే చర్చ జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్, కవిత మధ్య విభేదాలు వచ్చాయని.. క్రమంగా అది పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు.
కేటీఆర్ తో గ్యాప్ బాగా పెరగడం వల్లే ఆయనకు రాఖీ కట్టడానికి కవిత ఇష్టపడలేదని చెబుతున్నారు. అందుకే రాఖీ పౌర్ణమి రోజున హైదరాబాద్ లో ఉండకుండా విదేశాలకు వెళ్లారనే గుసగుసలు వినిపించాయి. తాజాగా ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కవిత హాజరు కాకపోవడంతో బయట జరుగుతున్న ప్రచారమంతా నిజమేనని తెలుస్తోంది. కేటీఆర్ సతీమణితో కలిసి బతుకమ్మ ఆడటం ఇష్టం లేకే కవిత.. ప్రగతి భవన్ వెళ్లలేదని అంటున్నారు. మొత్తంగా ప్రగతి భవన్ బతుకమ్మ వేడుకలకు కవిత హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది.