తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు.. మిగులు రాష్ట్రంలో ఎందుకీ దుస్థితి? జగనన్న చీకటి పథకమా?
posted on Oct 14, 2021 @ 10:52AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేండ్లు దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. విభజన తర్వాత ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలవగా.. తెలంగాణలో విద్యుతో కొరత తీవ్రంగా ఉండేది. అసలు విభజన సమయంలో ఈ వాదన వచ్చింది. తెలంగాణ విడిపోతే.. అక్కడ కరెంట్ సంక్షోభం వస్తుందనే భయాలు వ్యక్తమయ్యాయి. అప్పటి తెలంగాణ విద్యుత్ లెక్కలు అలానే ఉండేవి. కాని తర్వాత క్రమంగా సీన్ మారింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. చాలా రాష్ట్రాల్లో కరెంట్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. విద్యుత్ కొరతతో కోతలు విధిస్తున్నారు. రెండు , మూడు రోజుల్లో ఏపీలో చీకట్లు అలుముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాని గతంలో విద్యుత్ కొరత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వెలుగులు ఆరడం లేదు.
దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం ఏపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దసరా ఉత్సవాలు .. పండగ సెలవులు.. మహానది కోల్ ఫీల్డ్స్‌లో తవ్వకాలు నిలిచిపోవడం మొదలైన కారణాలతో విద్యుత్కేంద్రాలకు బొగ్గు అందడం కష్టసాధ్యంగా మారింది. ఏపీలో బుధవారానికి ఉన్న నిల్వలు 65 వేల టన్నులే. కోల్ మైన్స్ నుంచి రోజువారీ సరఫరా 8-12 వేల టన్నులకు మించడం లేదు. దీంతో రన్ అవుతున్న మూడు యూనిట్లలో ఒకదాన్ని మంగళవారం షట్‌డౌన్ చేశారు.
విజయవాడ ఎన్‌టీటీపీఎస్ లో 5,010 మెగావాట్లకు గాను 2,224 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జల విద్యుత్ 1,728 మెగావాట్లకు గాను 1,122 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. మంగళవారం 196 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. ఉదయం పూట ఎలాగోలా సర్దుబాటు చేస్తున్నా.. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకూ అధిక వినియోగం కారణంగా డిమాండ్‌ను తట్టుకోవడం ట్రాన్స్‌కోకు కష్టమవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు.
దేశచరిత్రలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్ అమ్మకపు ధరలు మండిపోతున్నాయి. ‘భారత ఇంధన ఎక్స్ఛేంజ్’(ఐఈఎక్స్)లో యూనిట్ ధర రూ.6.50 నుంచి 20 వరకూ పలుకుతోంది. గతంలో కొన్నిసార్లు రూ.18కి చేరితేనే డిస్కంలు అల్లాడాయి. ప్రస్తుత సంక్షోభంతో బొగ్గు కొరత ఉన్న రాష్ట్రాల డిస్కంలు ఎంతకైనా కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇతర రాష్ట్రాలు గరిష్ఠంగా రూ.20కి యూనిట్ చొప్పున కొంటుండగా.. తెలంగాణలో మిగులు విద్యుత్ ఉండటంతో రోజుకు 2 మిలియన్ యూనిట్ల దాకా ఐఈఎక్స్‌లో రాష్ట్రం విక్రయిస్తోంది. బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి సరఫరాలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుకు పోటీ పడుతుండటంతో ధర పెరుగుతోంది.
విద్యుత్ అమ్మే సంస్థలు, రాష్ట్రాలు ఇష్టారీతిన ధర పెంచవద్దని కేంద్రం హెచ్చరికలు జారీ చేసినా.. రూ.20 నుంచితగ్గడం లేదు. ఇంత ధర పెట్టి కొనలేక కొన్ని రాష్ట్రాలు కరెంట్ కోతలు విధిస్తున్నాయి.
తెలంగాణలో మిగులు ఎందుకంటే..
ఒక రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఎంత ఉంటుందో పరిశీలించి దానికన్నా కొంత అదనంగా అందుబాటులో ఉంచుకోవడానికి విద్యుత్కేంద్రాలతో పంపిణీ సంస్థలు కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకరోజు అత్యధిక విద్యుత్ డిమాండ్ 2021 మార్చి 26న 13,608 మెగావాట్లుగా నమోదైంది. ‘డిమాండ్’ అంటే ఒక రోజులో ఏదో ఒక సమయంలో అత్యంత ఎక్కువ వినియోగం. అది కాసేపు లేదా ఆ రోజంతా ఉండవచ్చు. దీంతో ప్రజలకు నిరంతర సరఫరా కోసం 16,613 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు పలు సంస్థలతో తెలంగాణ డిస్కంలు గతంలో పీపీఏలు చేసుకున్నాయి. రాష్ట్ర డిమాండ్ ఏడాదిలో చాలా రోజులు 10 వేల మెగావాట్ల వరకూ ఉండటంతో విద్యుత్ మిగులుతోంది. బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 8 వేల మెగావాట్లుంది. మిగులుగా ఉన్న సుమారు 2 మిలియన్ యూనిట్లను ఐఈఎక్స్‌లో సగటున రూ.10 వరకూ అమ్ముతున్నట్లు రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి.
గతంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణలో పరిస్థితి ఇలా ఉండగా.. గతంలో మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీలో మాత్రం అంతా తలకిందులైంది. విద్యుత్ కొరత కారణంగా ఎక్స్ఛేంజ్‌లో కొంటోంది. బుధవారం సాయంత్రం 6.45 నుంచి 7 గంటల మధ్య ఏపీ రాష్ట్ర గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 7,280 మెగావాట్లుండగా 8 లక్షల యూనిట్ల కొరత ఉంది. దీంతో ఐఈఎక్స్‌లో 2102 మెగావాట్లను కొన్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ వెల్లడించింది. ఒకవేళ విద్యుత్ కొనకపోతే కోతలు విధించాల్సి ఉంటుందని కేంద్ర అధికారులు వివరించారు. ఇందుకు కారణం పాలకుల విధానాలే అని తెలుస్తోంది. జగన్ రెడ్డి పాలనలో గత రెండున్నర ఏండ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు ఏపీకి గుది బండగా మారాయంటున్నారు. తెలంగాణ తరహాలోనే చంద్రబాబు ప్రభుత్వం కూడా విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా గతంలో పీపీఏలు కుదుర్చుకుంది. కాని జగన్ రెడ్డి పాలన వచ్చాకా వాటిని రద్దు చేసే ప్రయత్నాలు చేసింది. దీంతో ప్రస్తుతం ఏపీకి విద్యుత్ కష్టాలు వచ్చాయని అంటున్నారు.