షాడో సీఎం సజ్జల.. సకల శాఖ మంత్రిగా నియామకం!
posted on Oct 14, 2021 @ 6:07PM
రాజ్యంగం ప్రకారం మంత్రులంతా సమానం. అందులో ముఖ్యమంత్రి కాస్త ఎక్కువ సమానం. అంతే. మిగతా అంతా ఈక్వల్. ఒక్కో మంత్రి ఒక్కో శాఖను పర్యవేక్షిస్తుంటారు. మంత్రులంతా కేబినెట్‌కు జవాబుదారీగా ఉంటారు. కానీ, ఏపీలో అలా ఉండదు. పవర్ అంతా సీఎం జగన్‌రెడ్డి దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది. మంత్రులు ఉన్నా.. వాళ్లు డమ్మీలనే భావన ఉంది. ముఖ్యమంత్రి సూపర్ బాస్ అయితే.. మరి బాస్ ఎవరు? అనే డౌట్ రావొచ్చు. ఇంకెవరూ సజ్జల రామకృష్ణారెడ్డినే అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు పేరుతో.. అన్ని శాఖలకు ఆయనే మంత్రిగా చెలామని అవుతుంటారని చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండే ముఖ్యమంత్రి ఎలాగూ ఎవరికీ అందుబాటులో ఉండరు. అందుకే, ఏ శాఖలో ఏ పని కావాలన్నా.. సజ్జలతోనే అవుతుందని అంటారు. అన్ని శాఖలకు వేరు వేరుగా మంత్రులు ఉన్నా.. అన్ని శాఖల ఉమ్మడి మంత్రి మాత్రం సజ్జలనే అన్నట్టు వ్యవహారం సాగుతుందని అంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
రేపోమాపో సజ్జల మంత్రి అవుతారని అంటున్నారని చెప్పారు. ఒక్క శాఖకు మంత్రి అవుతారో లేక సకల శాఖలకు మంత్రి అవుతారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జలే మాట్లాడుతున్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సజ్జల సకలశాఖ మంత్రిగా.. సకల విషయాలు చూస్తారా? అంటూ రఘురామ ప్రశ్నించారు.
‘‘రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై కోల్ ఇండియా ఛైర్మన్‌తో చర్చించా. రాష్ట్రాలు బొగ్గు నిల్వల పెంపునకు యత్నించాలని చెప్పారు. కోల్ ఇండియాకు ఏపీ రూ.300 కోట్లు బాకీ ఉన్నట్టు చెప్పారు. 25 ఏళ్లవి రద్దు చేసి 30 ఏళ్ల ఒప్పందాలు చేసుకున్నారు. జగనన్న కొవ్వొత్తి పథకం, వైఎస్సార్ అగ్గిపెట్టె పథకమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని రఘురామ విమర్శించారు. జెన్‌కో, ట్రాన్స్‌కోకు ఒకరే చైర్మన్‌గా ఉండాలని సూచించారు.
అమ్మఒడి నిధులు జూన్‌కు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్టేనని రఘురామ మండిపడ్డారు. జగన్ నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందన్నారు. అమ్మ ఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో అప్పుల సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.2.87 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్ర ఖజానాలో రూ.1.31లక్షల కోట్ల లెక్కలు తేలట్లేదు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పలు వివరాలు విడుదల చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.