జగన్ రెడ్డి దొంగ భక్తీ?.. అమరావతిలో దొంగలు.. కరెంట్ కోతలు షురూ..టాప్ న్యూస్ @8PM
posted on Oct 13, 2021 @ 7:30PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వేదపండితులు తలపై వేసిన అంక్షితలను జగన్ అసహ్యంగా దులుపుకున్నారని, పవిత్రమైన ప్రసాదాన్ని వాసన చూశారని లోకేశ్ ఆరోపించారు. వెంకటేశ్వరస్వామిపై ఎందుకీ దొంగభక్తి జగన్ రెడ్డి గారూ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అంటూ ప్రశ్నించారు.
---
ఏపీ రాజధాని అమరావతిలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. అధికార వైసీపీ నేతల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు అయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తుళ్ళూరు తహశీల్దార్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. భూ మాయ వెలుగు చూడటంతో తహశీల్దార్ సెలవులోకి వెళ్లారు.
--
కేఆర్‌ఎంబీ తీర్మానాలకు ఎలా ఆమోదం తెలుపుతారు? అని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర రైతాంగానికి గొంతు కోసే కార్యక్రమమని దుయ్యబట్టారు. మీకు మీకు లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉండొచ్చు... కానీ రాష్ట్ర రైతాంగం హక్కులను ఎలా తాకట్టు పెడతారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
------
విజయవాడ సమీపంలోని వీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు కొరత ఏర్పడుతోంది. బొగ్గు సరఫరాను పెంచుకునేందుకు జెన్‌కో ప్రయత్నాలు చేస్తోంది. వీటీపీఎస్‌లోని 7 యూనిట్లకు గాను 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్ నిర్వహణ పనుల కారణంగా రెండో యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటీపీఎస్‌లో 1760 మెగావాట్ల సామర్థ్యానికి గాను 1280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు
-------
ఏపీలోను తెలంగాణ తెలుగు అకాడమీ అక్రమార్కులు దోచేశారు. ఏపీలో రెండు ప్రభుత్వ సంస్థల నుంచి సాయి కుమార్ బ్యాచ్ రూ.15 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. ఏపీ గిడ్డంగుల శాఖ నుంచి 9.60.కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్‌ల నుంచి రూ.5 కోట్ల ఎఫ్‌డీలు గల్లంతయ్యాయి. భవానిపురం IOB లోని గిడ్డంగుల కార్పొరేషన్ FD నుంచి రూ.9.60.కోట్లు నిందితులు కొట్టేశారు. కార్పొరేషన్ అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తామని బ్యాంక్ అధికారులు చెప్పినట్లు సమాచారం
-----
హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు నిలిచారు. చివరి రోజున 12 మంది అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరించారు. దీంతో ఉప ఎన్నికల బరిలో 30 మంది మిగిలిపోయారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇందులో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉండగా.. మరో ఏడుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. 20 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు హుజురాబాద్ ఉప సమరంలో పోటీలో నిలిచారు.
----
ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిధులు వస్తున్నాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పెన్షన్, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే వారందరూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారని ఈటల విమర్శించారు. ఇవన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి నుంచి, ఆయన సొంత భూమి అమ్మి, కూలీ పని చేసి ఇచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే నిధులు, పథకాలు ఇస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు.
--------
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు. జుడిషియల్ అధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. శ్రీ సుధా, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, తుకారం జి, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవి దేవిలకు పదోన్నతి కల్పించారు. గతనెల 16న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు
--------
అవార్డులు అందజేయడం ద్వారా మరెంతో మందికి ప్రేరణ కలుగుతుందని, భాషాభివృద్ధి దిశగా యువత ముందుకు రావడానికి దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వెంకయ్య నాయుడు డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు ఆచార్యులైన పోలూరి హనుమజ్జానకీ రామశర్ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా స్వయంగా అవార్డును నెలకొల్పి,తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్యకి అందజేశారు. తమ ఆచార్యుల పేరిట అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, పోలూరి హనుమజ్జానకీ రామశర్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు
-------
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.
---