'మెగా'కు కౌంటర్‌గా 'లెజెండ్'.. 'మా'లో దబిడి దిబిడే...
posted on Oct 14, 2021 @ 1:43PM
ప్రకాశ్‌రాజ్‌కు మెగా సపోర్ట్ ఉంది. ఆయన సింగిల్‌గా ఉండుంటే.. ఇంత సీన్ క్రియేట్ అయ్యేదే కాదు. మా ఎన్నికలు ఇంత ప్రెస్టీజియస్‌గా సాగేవే కాదు. కసురుకోవడాలు.. కొరుక్కోవడాలు.. తిట్టుకోవడాలు.. బెదిరించుకోవడాలు.. రాజీనామాలు.. ఇలా రచ్చ రంభోలా జరిగేదే కాదు. ఎన్నికలకు ముందు జగడమే.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాకా సమరమే.. తగ్గేదే లే అంటూ ఇరు పక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాత్రి గెలిచాం.. ఉదయానికి ఓడిపోయాం... ఎలా ఓడిపోయామో దుర్గమ్మకే తెలియాలంటూ.. 'మా' వేడిని అలా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక మూకుమ్మడి రాజీనామాలతో మంచు విష్ణుకు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. విష్ణు ఏం చేస్తారో చూడాలని వెయిట్ చేస్తోంది.
అబ్బా.. ఇంత పని చేస్తారా.. అంటూ మంచు సైతం ఏమాత్రం తగ్గట్లేదు. ఒక రోజు టైమ్ తీసుకొని.. ఖతర్నాక్ స్టెప్ వేశారు. మెగాకు కౌంటర్‌గా.. మోహన్‌బాబు, విష్ణులు కలిసి.. టాలీవుడ్ లెజెండ్ బాలయ్యను ఆశ్రయించారు. తండ్రితనయులు ఇద్దరూ నందమూరి ఇంటికెళ్లి కలిశారు. మరోసారి నందమూరి మద్దతు తీసుకున్నారు. బాలయ్య సైతం మంచు విష్ణుకు నేనున్నానంటూ అభయమిచ్చారు.
మెగా కాకపోతే నందమూరి. అంతే కానీ.. ఇందాకా వచ్చాక ఇక ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని మంచు ఫ్యామిలీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేసింది. తమను ఎంత ఇబ్బంది పెడదామని చూసినా.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామా చేసినా.. డోంట్‌కేర్ అన్నట్టు ముందుకు సాగుతున్నారు. ఇండస్ట్రీ అంటే వాళ్లేనా.. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారన్నట్టు.. కోటా, కైకాల, పరుచూరి.. తదితరులను ఇప్పటికే కలిసి మద్దతు కోరారు. పనిలో పనిగా త్వరలోనే చిరంజీవినీ కలుస్తానంటున్న మంచు విష్ణు.. ఆయనకు లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పారు.
ఇలా బాలయ్యను కలిసి.. ఆయన్ను రంగంలోకి దింపి.. మంచు విష్ణు వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. ఇటు మెగా డైరెక్షన్‌లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలతో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వగా.. సింహంలాంటి బాలయ్య బాబుతో మరింత అదిరేలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మంచు విష్ణు. ఇలా ఎత్తులకు పైఎత్తులతో 'మా' రాజకీయం రంజుగా సాగుతోంది. వన్స్ బాలయ్య స్టెప్ ఇన్.. ఇక 'మా'లో దబిడి దిబిడే...