హెటిరో సొమ్ము జగన్‌దేనా?.. రేవంత్ వెటరన్ పాలిటిక్స్.. 'మా'లో మరింత మంట.. టాప్ న్యూస్ @ 7pm
posted on Oct 14, 2021 @ 6:42PM
1. అవసరమైతే పాకిస్తాన్‌పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ దాయాది దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. దాడి చేసినవారితో కూర్చుని చర్చించే రోజులు ఒకప్పుడు ఉండేవని, ఇవి ఉగ్రవాద దాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని హెచ్చరించారు. జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదులు హిందువులు, సిక్కులను గుర్తించి మరీ చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2. మహర్నవమి సందర్భంగా తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ రాజ్‌భవన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. రాజ్‌భవన్‌లో సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన ఆయుధాలకు, వాహనాలకు గవర్నర్ పూజ చేశారు. రాజ్‌భవన్ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఆమె భర్త సౌందరరాజన్, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
3. మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్ లేఖ రాశారు. ఎన్నికల రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్ మా సభ్యులను బెదిరించారని, దాడులకు పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు.
4. మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతకుముందు మంచు విష్ణు, మోహన్‌బాబులు నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. త్వరలోనే చిరంజీవిని సైతం కలుస్తానని చెప్పారు మంచు విష్ణు.
5. తూర్పుగోదావరి జిల్లాలోని రాయుడుపాలెంలో సచివాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కన్నబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గుడి విషయంలో బీసీ వర్గానికి కాకుండా.. కాపు వర్గానికి పెద్ద పీఠ వేయడాన్ని బీసీ నాయకులు వ్యతిరేకించారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి వేరే సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆగ్రహంతో అక్కడి నుంచి మంత్రి కన్నబాబు వెళ్లిపోయారు.
6. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. డీఎస్ కిందపడిపోగా చెయ్యి విరిగిందని, ఈ విషయం తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు రేవంత్‌రెడ్డి. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని, డి.శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
7. హెటిరోలో దొరికిన సొమ్మంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రూ.147 కోట్లు మాత్రమే కాదని ఇంకా వేల కోట్లలో దాచారన్నారు. ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనన్నారు. ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.
8. రేపోమాపో సజ్జల మంత్రి అవుతారని రఘురామ జోస్యం చెప్పారు. ఒక్క శాఖకు మంత్రి అవుతారో లేక సకల శాఖలకు మంత్రి అవుతారో అర్థం కావట్లేదంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జలే మాట్లాడుతున్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సజ్జల సకలశాఖ మంత్రిగా.. సకల విషయాలు చూస్తారా? అంటూ రఘురామ ప్రశ్నించారు.
9. గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ ఇరిగేషన్ వర్గాల్లో తర్జనభర్జన మొదలైంది. గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ససేమిరా అంటోంది. తమ వైపు నుంచి ఏం చేయాలనే దానిపై ఏపీ మల్లగుల్లాలు పడుతోంది. విద్యుత్ కేంద్రాలు, ఆఫ్‌టేక్ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. ప్రాజెక్టులు అప్పగించే ప్రక్రియని మొదలుపెట్టాలని ఏపీ ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. సీఎం జగన్‌తో చర్చించిన తర్వాత ప్రాజెక్టుల అప్పగింతపై జగన్ సర్కార్ ముందడుగు వేయనుంది.
10. తిరుమల క్షేత్రాన్ని, శ్రీవారి మహత్యాన్ని జగన్ ప్రభుత్వం మంటగలుపుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. తిరుమల స్వామివారి సన్నిధిలో గోవింద నామస్మరణకు బదులుగా జగన్మామస్మరణ చేయడమేంటని ప్రశ్నించారు. హిందూమతాన్ని, హిందువులను గౌరవించలేని వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఇంత ఘోరం జరుగుతుంటే స్వామీజీలు, పీఠాధిపతులు ప్రభుత్వాన్ని, పాలకులను ఎందుకు ప్రశ్నించడంలేదని పుట్టా సుధాకర్ యాదవ్ నిలదీశారు.