కేటీఆర్ వర్సెస్ కవిత? టీఆర్ఎస్ లో ఏమి జరుగుతోంది.. పెనుమార్పులు తప్పవా?
posted on Oct 14, 2021 @ 7:21PM
తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఆసక్తికర చర్చకు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఎన్నిక షెద్యూలు వచ్చే వరకు, ముఖ్యమంత్రి మొదలు, (కేటీఆర్ మినహా) పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఫోకస్ మొత్తం హుజూరాబాద్ మీదనే పెట్టారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఆయన అక్కడ ఉండగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది.
ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, కారణాలు ఏవైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ముందున్న శ్రద్ద ఆసక్తి ఫోకస్ ఇప్పుడు లేవేమో అనిపించేలా ఆయన కార్యక్రమాలలో మార్పు కనిపిస్తోంది. చినజీయర్ స్వామి, యాదాద్రి ఆలయ అభివృద్ధి, ప్రారంభోత్సవం వంటి ఇతర అంశాల మీద ముఖ్యమంత్రి దృష్టిని మరల్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పొలిటికల్ ఫోకస్ ను ఎందుకు హుజూరాబాద్ నుంచి పక్కకు తప్పించారో ఏమో కానీ,అదే సమయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షడు, మంత్రి కేటీఆర్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ద్వి దశాబ్ది ఉత్సవాల ప్రకటనతో హుజూరాబాద్ ఉప ఎన్నిక, నాట్ సో ఇంపార్టెంట్, అంత ముఖ్యమైన విషయం కాదు అన్న సంకేతాలను పంపారు. దీంతో, హుజూరాబాద్’నుంచి ముఖ్యమంత్రి వెనకడుగు వేయడం కూడా ఆ వ్యూహంలో భాగమే అనే, అనుమానాలు బలపడుతున్నాయి.
తెరాస సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్యవర్గాల నియామకాలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియలో ప్రధాన ఘట్టం పార్టీ అధ్యక్షుని ఎన్నిక అక్టోబర్ 25న జరుగుతుందని, తెరాస అధ్యక్షునిగా పోటీ చేయాలనుకునే వారు అక్టోబర్ 17 నుంచి నామినేషన్లను వేయవచ్చని కేటీఆర్ ప్రకటించారు. అయితే, పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆరే అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రతి సారీ ఏకగ్రీవంగానే ఆయన ఎన్నికవుతున్నారు. అయితే ఈ సారి, ఆ ఆనవాయితీ మారుతుందా? తెరాసకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అంటే, పార్టీలో అవుననే మాటే ఎక్కువగా వినవస్తోంది.
ఈ సారి కేసీర్ తప్పుకుని, కేటీఆర్ కు అవకాశం ఇస్తారని, అందుకోసమే, ఎవరూ అడ్డుకునే అవకాశం లేకుండా షెడ్యూలు ఫిక్స్ చేశారని పార్టీ వర్గాల సమాచారం.కీటీఅర్ కు పార్టీ, ప్రభుత్వ ఉత్తరాదికారి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భావిస్తున్నారని అందుకే, ఈటల పై వేటు మొదలు వ్యూహాత్మకంగా ఒక్కొక అడుగు వేసుకుంటూ వస్తున్నారని అంటున్నారు. ఇప్పుడే కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ,అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండటంతో. ఆయన తనకు కావాల్సిన వారికి టికెట్లు ఇచ్చి, భవిష్యత్తుల్లో ముఖ్యమంత్రి పదవికి అడ్డు లేకుండా, ఏ సమస్యా రాకుండా చేసుకోవడానికి వీలు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.
నిజానికి కేటీఅర్ కు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో పదోన్నతి కలిపించే విషయంగా, కుటుంబంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలు,విభేదాల కారణంగానే, కవిత పుట్టింటికి (ప్రగతి భవన్)కు దూరంగా ఉంటున్నారని, ఈ విషయంలో కేటీఆర్, కవిత మధ్య దూరం బాగా పెరిగిందనే వార్తలు చాలా కాలంగా వినవస్తున్నాయి. రాఖీ పండగకు కవిత అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేదు. సరే,అప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు కాబట్టి రాలేక పోయారు అనుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మకు ప్రాచుర్యం కలిపించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టిల్లు, ప్రగతి భవన్’ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనక పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. అదెలా ఉన్నా, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే తెరాసలో పెను మార్పులు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.. సందేహలు బలపడుతున్నాయి.