ఏపీ సర్కార్ వెయ్యి కోట్ల అప్పు.. పవన్ వార్నింగ్.. హుజురాబాద్ లో హీట్.. సమంతకు రిలీఫ్ టాప్ న్యూస్@7PM
posted on Oct 26, 2021 @ 7:29PM
మరో వెయ్యి కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. 7.2% వడ్డీతో ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన రుణ పరిమితిలో 10 వేల కోట్లు సెక్యూరిటీ బాండ్లను వేలం ద్వారా సమీకరించింది. మరో 500 కోట్లకు మాత్రమే ఏపీకి రుణ పరిమితి మిగిలి ఉంది. మళ్లీ అప్పు కోసం కేంద్రం దగ్గరకు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు వెళ్తున్నారు.
----
ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజాగా కాకినాడలోని జగన్నాథపురం సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ పాఠశాలను మూసివేయవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చుట్టుముట్టారు. స్కూలు మూసివేస్తే పిల్లలు ఇబ్బందిపడతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
----
రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను మూసివేయవద్దని ప్రభుత్వాన్ని ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. బెల్టులు, బూట్లు, అమ్మవడి మాకొద్దు.. తమ స్కూల్ తమకు కావాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిన్న విశాఖ జ్ఞానాపురం దగ్గర విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేసారని పవన్ ట్వీట్ చేసారు. ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల మూసివేతకు అధికార వైసీపీ నిర్ణయంతో ఈ సమస్య ఏర్పడిందని పవన్ ట్వీట్ చేసారు.
---
టీడీపీ నేత పట్టాభి వీడియో విడుదలైంది. తన ఇంటిపై జరిగిన దాడిలో తన కుమార్తె తీవ్రమైన మనోవేదనలోకి వెళ్లిందని పేర్కొన్న ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెను తీసుకుని బయటకు వచ్చానని పట్టాభి వివరించారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించారని చెప్పారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విధ్వంసానికి దిగారని మండిపడ్డారు.
-----
ఉప ఎన్నిక జరుగతున్న హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటల రాజేందర్ ఏం చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. ఎవరెక్కువ దోచుకున్నారనే విషయంలోనే కేసీఆర్, ఈటల మధ్య పంచాయితీ వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని ఉత్తమ్ ఆరోపించారు. గతంలో ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఉత్తమ్ విమర్శించారు.
------
సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం యాత్రలో ఆమె ఈ విమర్శలు చేసారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని షర్మిల ఆరోపించారు. మాట తప్పితే రాళ్లతో కొట్టమన్నారని, ఇప్పుడు ఏం చేయాలో కేసీఆర్ చెప్పాలని షర్మిల డిమాండ్ చేసారు. అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకే ఉద్యోగాలా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులకు ఆత్మహత్యలా అని షర్మిల అన్నారు.
------
ఐఐటీ తదితర జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం మెరుగైన ర్యాంకులు సాధించిన ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల విద్యార్థులను సీఎం జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఐఐటీ, ఇతర ర్యాంకర్లతో సీఎం జగన్ భేటీ అయ్యారు. వారికి ల్యాప్ టాప్ లు బహూకరించారు. ఉన్నతస్థాయికి ఎదిగే క్రమంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందుతాయని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
-----
సమంతపై కంటెంట్ ను యూట్యూబ్ చానళ్లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈమేరకు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సీఎల్ వెంకట్రావు సైతం తన కంటెంట్ ను తొలగించాలని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. యూట్యూబ్ చానళ్లు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడరాదని, అదే సమయంలో సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది.
-----
పరువు నష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని తమ ముందు హాజరు కవాల్సిందిగా గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టు ఆదేశించింది. ‘మోదీ’ అనే పేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్‌పై పరువునష్టం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఈ ఏడాది జూన్ 24న కోర్టు ముందు రాహుల్ హాజరయ్యారు.
---------
టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఆ మ్యాచ్ లపై బెట్టింగ్ జోరుగా సాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. క్రికెట్ లైవ్ గురు యాప్ ద్వారా బెట్టింగ్ జరుగుతోందని తెలిపారు. బెట్టింగ్ గురించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బెట్టింగ్ సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
---