ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఫిక్స్.. కొత్తగా ఎవరెవరంటే?
posted on Oct 26, 2021 @ 8:06PM
ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వం కొత్త మంత్రులతో కొలువు తీరబోతోంది. అందుకోసం డిసెంబర్ 8వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. జగన్ తన కేబినెట్‌లోకి మంత్రులుగా అందరినీ కొత్త వారిని తీసుకుంటారని తెలుస్తోంది. అయితే తన మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలని అనే అంశంపై సీఎం జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని అమరావతిలో వైరల్ అవుతుంది. ఆ క్రమంలో వివిధ జిల్లాల పార్టీ ఇన్ చార్జులతో సీఎం జగన్ పలుమార్లు సమావేశమై ఆ అంశంపై కూలంకుషంగా చర్చించారని సమాచారం.
ఈ సారి మంత్రివర్గ విస్తరణలో కులాలు, ప్రాంతాల ప్రాతిపదికతోపాటు తొలినాళ్ల నుంచి పార్టీని అంటి పెట్టుకున్న వారు, పార్టీలో సీనియర్లు, పార్టీ కోసం బలమైన వాయిస్ వినిపించే వారు, గత ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటి ఇచ్చిన వారు, 2024 ఎన్నికలు..... ఇలా పలు అంశాలను సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పును చేపట్టారని తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేల పని తీరుపై ఇంటిలిజెన్స్ నివేదికలు ఇప్పటికే సీఎం జగన్ టేబుల్ పైకి చేరాయి. అలాగే ఇప్పటి వరకు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవులు నిర్వహించిన వారి వివరాలు సైతం సీఎం జగన్ వద్దకు చేరాయి. వాటి ఆధారంగా తాజాగా మాజీలవుతన్న వారికి పార్టీలోని వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సీఎం జగన్ మంత్రి వర్గ విస్తరణ కోసం కసరత్తు అని తెలియగానే.. ఫలువురు వైయస్ఆర్సీపీ ఆశావాహ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
2019, ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 22 మంది లోక్ సభ సభ్యులుగా, 151 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. జూన్ 8వ తేదీన 25 మంది ఎమ్మెల్యేలతో జగన్ కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. వారిలో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే కొత్తగా కొలువు తీరిన మంత్రి వర్గం రెండున్నరేళ్ల వరకే ఉంటుందని... ఆ తర్వాత కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అప్పడే స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.