మటన్ తింటున్నారా? బీఅలర్ట్.. గొర్రెలకు ఆంత్రాక్స్..
posted on Oct 27, 2021 @ 1:16PM
బర్డ్‌ఫ్లూ తెలుసుగా. కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకితే ఇక అంతే సంగతి. లక్షల్లో కోళ్లను ఖననం చేసేస్తారు. ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడిపోతారు. ఇలా బర్డ్‌ఫ్లూ న్యూస్ వచ్చిందో లేదో.. అలా చికెన్ ధరలు ఢమాల్ అంటాయి. కోళ్లకు బర్డ్‌ఫ్లూ లానే.. గొర్రెలకు ఆంత్రాక్స్. తాజాగా, వరంగల్ జిల్లాలో 4 గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోవడం కలకలం రేపుతోంది. గొర్రెల్లో ఆంత్రాక్స్ చుట్టేస్తోందా? మటన్ తినడం సేఫేనా? త్వరలోనే మటన్ రేట్లు పడిపోనున్నాయా?
సండే వచ్చిందంటే మటన్‌కు ఉన్నంత డిమాండ్ మరేదానికీ ఉండదు. మటన్ షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలు. గంటల తరబడి వెయిట్ చేసి మరీ.. మటన్ కొని..కమ్మగా వండుకొని తింటారు. చికెన్‌తో పోలిస్తే.. మటన్ చాలా కాస్ట్‌లీ అయినా కూడా మటన్ తినకుండా ఉండలేరు చాలా మంది. అలాంటి మటన్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. తింటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకు కారణం ఆంత్రాక్స్.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో 4 గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మృతి చెందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేయడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా బయటపడకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మటన్ కొనేముందు.. వాటిని పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో కన్ఫామ్ చేసుకోవాలని చెబుతోంది. వ్యాధి సోకిన గొర్రెలు, మేకల మాంసాన్ని తినడం, తాకడం, అమ్మడం చేయవద్దని గొర్రెల కాపరులకు, మటన్ అమ్మకం దారులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. ఒకవేళ తెలీక ఆంత్రాక్స్ సోకిన గొర్రె, మేక మటన్ కొన్నా.. వండేటప్పుడు బాగా ఉడికించి తినాలని అధికారులు సూచిస్తున్నారు.