వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జీషీట్.. హంతకులెవరంటే?
posted on Oct 27, 2021 @ 12:08PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జీషీట్ దాఖలు చేసింది సీబీఐ. నలుగురు నిందితుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ 90 రోజుల రిమాండ్ గడువు ముగుస్తున్నందున సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
2019 మార్చితో తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేకానందరెడ్డి. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే హత్య జరగడంతో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులు మొదట ఏపీ పోలీసులే విచారించారు. అయితే వివేకా కూతురు సునీతా రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివేదా హత్య కేసులో సీబీఐ అధికారులు ఏడాదిపాటు దర్యాప్తు చేసి ఇప్పటివరకూ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ ను ఈ ఏడాది ఆగస్టు 4న అరెస్ట్ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ 9న సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
ఈ కేసులో మొత్తం నలుగురి ప్రమేయం ఉందని సీబీఐ ప్రాథమిక విచారణలో తేల్చింది. వారిలో ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి డ్రైవర్ దస్తగిరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అవే విషయాలు పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా సీబీఐ పలు సార్లు విచారించింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కూడా ప్రశ్నించింది.
అయితే సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? హత్యకేసులో ఎవరి పాత్ర ఉందనే విసయాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. మరికొద్దిరోజుల్లోనే సీబీఐ అధికారులు పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఛార్జిషీట్ లో వివేకా హత్యలో అసలు పాత్రధారులు సూత్రధారుల ప్రమేయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.