టీవీ5 కేసులో సంచలనం.. అరెస్టులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
posted on Oct 27, 2021 @ 5:44PM
వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను మెజిస్ట్రేట్లు గుర్తించుకోవాల్సిందేనని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. అలా పాటించకపోతే మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కేసం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు .. అన్వేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మెజిస్ట్రేట్లు పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మీడియా ప్రతినిధులు , సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టేవారిపై నిబంధనలకు విరుద్దంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీవీ5 ఛైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లోనూ 41ఏ కింద వివరణ తీసుకోకుండా అరెస్ట్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో రిమాండ్ విధించే సమయంలో వ్యక్తుల స్వేఛ్చకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామన్న విషయాన్ని మెజిస్ట్రేట్లు గుర్తించుకోవాలని హైకోర్టు తెలిపింది.
ఇక ఎఫ్ఐఆర్ డౌన్ లోడ్ చేసుకునే వారి నుంచి వ్యక్తిగత సమాచారం కోరడంపైనా పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు అధికారిక వెబ్ సైట్, ఏపీ పోలీస్ సేవా యాప్ లో వ్యక్తిగత సమాచారం కోరడం గోప్యత హక్కును హరించడమేనని కోర్టుకు తెలిపారు. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు ధర్మాసనం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎవరూ ఎక్కడా, సరిగా పాటించడం లేదని అభిప్రాయపడింది. వాటిని పాటించేలా తగిన ఉతర్వులు ఇస్తామంటూ తీర్పును రిజర్వ్ చేసింది. 41ఏ నిబంధనల అమలు విషయంలో పోలీసులకన్న న్యాయస్థానాలకే ఎక్కువ బాధ్యత ఉందన్న హైకోర్టు..సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగా తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపింది.