ధూళిపాళ్ల మళ్లీ టార్గెట్.. నరేంద్రకు నోటీసులు
posted on Oct 27, 2021 @ 12:00PM
ఏం మారలేదు. ప్రభుత్వ తీరు ఏమాత్రం మారడం లేదు. కక్ష్య సాధింపు చర్యల్లో అధికార పార్టీ అసలే మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోంది. పాత-కొత్త విషయాలన్నీ బయటకు తీసి.. లేనిపోని చిక్కులు సృష్టించి.. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను, పరపతిని దారుణంగా దెబ్బ కొడుతోందని అంటున్నారు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిష్టూరాలు. ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్టుందని విమర్శిస్తున్నారు. అన్నిరంగాల్లో విఫలమైన జగన్‌రెడ్డి సర్కారు.. ప్రజల దృష్టి మరల్చేందుకే.. విపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకు.. పాలక పక్షం నిర్విరామంగా ప్రయత్నిస్తోందనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ నోటీసులు జారీ చేశారు. సహకార చట్టం 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. పాల రైతుల కుటుంబ సభ్యులకు రాయితీతో అక్కడ వైద్యం అందిస్తున్నారు.
ఇప్పటికే ధూళిపాళ్లను దెబ్బకొట్టేందుకు సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే కుట్ర చేశారు. నరేంద్రను అరెస్టు చేసి జైలుకు తరలించి కక్ష్య తీర్చుకున్నారు. హైకోర్టుకు వెళ్లి మరీ సంగం డెయిరీని కాపాడుకున్నారు ధూళిపాళ్ల. అది వర్కవుట్ కాలేదనుకున్నారో ఏమో.. ట్రస్ట్ నుంచి నరుక్కొస్తున్నారని మండిపడుతున్నారు ధూళిపాళ్ల నరేంద్ర.