డ్రగ్స్ హబ్‌గా ఏపీ.. గంజాయిపై జనసేనాని గరం గరం..
posted on Oct 27, 2021 @ 10:56AM
డ్రగ్స్-గంజాయి. కొంతకాలంగా ఏపీ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. దేశం ఉలిక్కిపడేలా గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన వేల కోట్ల విలువైన డ్రగ్స్ విజయవాడ అడ్రస్‌కే వస్తున్నాయంటే మాటలా? బాలీవుడ్‌లో గాంజా దొరికితే కూడా.. అది విశాఖ నుంచే ముంబైకి సప్లై అయిందని ఏకంగా ఎన్‌సీబీనే ప్రకటించడం సంచలనం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఏపీలో ఇలాంటి డ్రగ్స్ సీన్ చూశామా? జగన్‌రెడ్డి పాలనలోనే ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడుతున్నారు. అడ్డుకునే వాళ్లు లేక.. పట్టుకునే వాళ్లు పట్టించుకోక.. పాలకుల ఉదాసీనత వల్లే ఇలా ఏపీ డ్రగ్స్-గంజాయికి కేరాఫ్‌గా మారిందని అంటున్నారు. ఆ విషయం ప్రశ్నిస్తే.. అధికార పార్టీకి బీపీ పెరిగింది. వీధి రౌడీల్లా టీడీపీ ఆఫీసుపై పడి విధ్వంసం సృష్టించారు. ఆ కేసులో ఇంతవరకూ అరెస్టులు జరగలేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఏపీలో డ్రగ్స్, గంజాయి దందాపై లేట్‌గా అయినా, లేటెస్ట్‌గా రియాక్ట్ అయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదక ద్రవ్యాల హబ్‌గా మారిందని ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందంటూ.. వరుస ట్వీట్లు చేశారు.
‘‘గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి’’ అని పవన్ ట్వీట్ చేశారు.
ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన మీడియా ప్రసంగ వీడియో క్లిప్‌లతో మరో రెండు ట్వీట్లు చేశారు పవన్‌కల్యాణ్.