పాక్ ఫ్యాన్స్ కు కశ్మీర్ పోలీసుల షాక్.. 'ఉపా' కేసులు నమోదు..
posted on Oct 27, 2021 @ 1:05PM
ఆటల్లో గెలుపోటములు సహజం. గెలిచిన జట్టు సంబరాలు చేసుకోవడం కామన్. క్రికెట్ లో ఇది కొంత ఎక్కువగా ఉంటుంది. గెలిచిన జట్టుతో పాటు ఆ దేశంలోనూ సంబరాలు జరుగుతాయి. అయితే ఒక్క ఇండియాలో మాత్రమే మరో సీన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ పరాయి దేశం చేతిలోఇండియా ఓడిపోయినా.. కొందరు మూర్ఖులు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. పాకిస్తాన్ జట్టు భారత్ పై గెలిస్తే సంతోషం వ్యక్తం చేస్తూ క్రాకర్స్ కాల్చుతుంటారు. ఇలాంటి ద్రోహుల తాట తీస్తున్నారు పోలీసులు. కశ్మీర్ లో వైద్య విద్యార్థులపై ఏకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసులు పెట్టి జైలుకు పంపారు.
టీట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇండియాపై పాక్ గెలుపు సాధించడాన్ని ఆస్వాదిస్తూ కశ్మీర్ లోయలో పలుచోట్ల విద్యార్థులు కేరింతలు కొట్టారు. సంతోషంతో డ్యాన్సులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీడియో ఆధారంగా విచారణ జరిపిన జమ్మూ-కశ్మీర్ పోలీసులు .. పాక్ గెలుపుపై సంబరాలు చేసుకున్న వైద్య విద్యార్థులపై రెండు ఠాణాల పరిధిలో కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద వీరిపై అభియోగాలు మోపారు. అయితే మానవతా దృక్పథంతో విద్యార్థులపై కఠినమైన ఉపా కేసుల్ని ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను జమ్మూ-కశ్మీర్ విద్యార్థుల సంఘం కోరింది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఇదే అంశంపై ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పాక్ విజయాన్ని ప్రస్తావిస్తూ ‘మనం గెలిచాం’ అనే అర్థంతో వాట్సప్‌లో ఆమె స్టేటస్ పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగించింది.