దీపావళికే జియో-గూగుల్ నెక్స్ట్ ఫోన్.. తెలుగువారితో కనెక్ట్ ఏంటి?
posted on Oct 27, 2021 @ 3:02PM
జియోఫోన్ ‘నెక్ట్స్’. ఇండియన్స్ ఆసక్తికంగా వెయిట్ చేస్తున్న సరికొత్త ఫోన్. జియో-గూగుల్ సంయుక్తంగా తీసుకొస్తున్న జియోఫోన్ ‘నెక్ట్స్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ ఫోన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు జనాలు. తాజాగా, ఈ దీపావళికే జియోఫోన్ ‘నెక్ట్స్’ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తామని తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. జియోతో కలిసి ప్రాంతీయ భాషల్లో.. అందుబాటు ధరలో.. ఫోన్ తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.
వివిధ ప్రాంతీయ భాషలు మాట్లేడే వ్యక్తులను కలిపేలా.. దేశంలోని 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను లక్ష్యంగా.. జియోఫోన్ నెక్స్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది జియో-గూగుల్. ఇండియాకే ప్రత్యేకమైన ఫీచర్స్ దీని సొంతం. ఈ టచ్‌స్క్రీన్ ఫోన్‌లో భారత్‌లో పలు భాషలు మాట్లాడే వారికి అనుగుణంగా భాషా-అనువాద టూల్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ ఫీచర్ 10 భారతీయ భాషలను కావాల్సిన లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయగలదు.
వాయిస్ అసిస్టెంట్: ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఓపెన్ చేయించొచ్చు. మనకు నచ్చిన భాషలోనే ఇంటర్నెట్‌లోని కంటెంట్ పొందొచ్చు.
ట్రాన్స్‌లేట్: తెరపై ఉన్న ఏ కంటెంట్‌నైనా మనకు ఇష్టమైన భాషలోకి అనువాదం చేసుకోవచ్చు.
స్మార్ట్ కెమెరా: స్మార్ట్, పవర్‌ఫుల్ కెమెరాతో పలు మోడ్‌లలో నచ్చిన విధంగా ఫొటోలు తీసుకోవచ్చు. నైట్ మోడ్ కూడా ఉంది. ఆగుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ: ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఎక్కువ కాలం పాటు ఛార్జ్ పెట్టకుండానే వాడుకోవచ్చు.
ఇలాంటి అనేక ప్రత్యేకతలు ఉన్న జియోఫోన్ నెక్స్ట్.. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలోనే ఉండనుండటం విశేషం. ఇక, జియోఫోన్‌లో క్వాల్‌కామ్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది తిరుపతి, శ్రీపెరంబదూరులో ఆర్‌ఐఎల్ గ్రూప్‌నకు చెందిన నియోలింక్ యూనిట్లలో తయారవుతుండటం.. తెలుగువారిని ఈ ఫోన్‌తో మానసికంగా కనెక్ట్ చేయనుంది. ఇంకేం, ఈ దీపావళికి జియో ఫోన్ పండగే.