ఓటుకు ఆరు వేలు.. హుజురాబాద్ లో పండుగే పండుగ..
posted on Oct 27, 2021 @ 12:36PM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లకు ప్రలోభాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా.. వారం రోజుల ముందు నుంచే మనీ, మందు పంపిణి మొదలైంది. బుధవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో.. ఆ తర్వాత ఓటర్లకు భారీగా నజరానాలు ముట్టచెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డబ్బులతో పాటు మందును రహస్య స్థావరాల్లో డంప్ చేశారని తెలుస్తోంది.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచే డబ్బుల పంపిణి మొదలు పెట్టారని తెలుస్తోంది. కమలాపూర్ మండలంలో సోమవారమే అధికార పార్టీ ఓటర్లకు డబ్బులు ఇచ్చిందని తెలుస్తోంది. ఒక్కో ఓటుకు ఆరు వేలు రూపాయలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కమలాపూర్ మండలంలో ఓట్ల పంపిణికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏ వీడియోలో ఆరు వేల రూపాయలను కవర్ లో ప్యాక్ చేసి ఓటర్ ఇచ్చినట్లుగా ఉంది. ప్యాక్ లో 12 ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి. ఓటుకు ఆరువేల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం
నియోజకవర్గ వ్యాప్తంగా 121గ్రామాలలో పంపిణీ జరుగుతున్నట్టు ప్రచారం
అధికార పార్టీకి ధీటుగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఓటర్లను డబ్బులు పంపిణి చేస్తున్నారని తెలుస్తోంది. డబ్బులు, మందు పంపిణికి సంబంధించి ప్రధాన పార్టీలు ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపాయంటున్నారు. స్థానిక నేతలతో సంబంధం లేకుండానే వాళ్లు నేరుగా ఓటర్ల దగ్గరకు వెళ్లి డబ్బుల కవర్లు ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటుకు ఆరువేలు ఇస్తున్నారని, హోరాహోరీగా ఉన్న చోట 10 వేల వరకు ఇచ్చేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు.
మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. అయితే అధికార పార్టీ నేతలను వదిలేస్తూ బీజేపీ నేతలపైనే పోలీసులు నిఘా పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కమలం నేతలు మండిపడుతున్నారు.