టీటీడీ బోర్డులో నేరచరితులా?.. ఇదేమి చోద్యం? హైకోర్టు ఆగ్రహం..
posted on Oct 27, 2021 @ 12:47PM
రెండున్నరేళ్లుగా టీటీడీ బోర్డు నిత్యం వివాదాస్పదమవుతోంది. జంబో బోర్డుతో ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారందరికీ టీటీడీలో చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపార, రాజకీయ ప్రముఖులను భారీగా బోర్డులోకి తీసుకుంటున్నారనే విమర్శ ఉంది. తాజాగా, నేరచరిత్ర ఉన్న వారినీ సభ్యులుగా నియమించడం వైసీపీ ప్రభుత్వం తీరుకు నిదర్శనం అంటున్నారు.
టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకమండలి సభ్యులుగా నేర చరిత్ర ఉన్న వారిని నియమించారంటూ.. జీవోను సవాల్ చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. భానుప్రకాష్ పిటిషన్‌పై న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు.
భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ధర్మాసనం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించిన జీవోను ఇటీవల హైకోర్టు నిలిపివేయడంతో.. ప్రభుత్వం దొడ్డిదారి కోసం ప్రయత్నిస్తోంది. చట్ట సవరణ రూపంలో మార్గం సుగమం చేసుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు 52మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ సెప్టెంబరులో జీవో నెం.568 & 569 జారీ చేసింది. అయితే దేవదాయచట్టం-1987 ప్రకారం టీటీడీ బోర్డుకు ఛైర్మన్, 29మందికి మించని సభ్యులను మాత్రమే నియమించాలని, ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి అవకాశం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆ జీవోల అమలును నిలిపివేసింది. దీంతో చట్టంలో సంబంధిత సెక్షన్లకు సవరణలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రత్యేక ఆహ్వానితులను కూడా టీటీడీ బోర్డు సమావేశాలకు ఆహ్వానించే అవకాశం కల్పించడం, నియామకాలకు అవకాశం ఇచ్చేలా సవరణ చేయనున్నారని తెలుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన 28న జరగనున్న కేబినెట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.