బ్రిటన్‌లో అమరావతి భద్రం.. జగన్ పాలనలో విధ్వంసం!..
posted on Oct 27, 2021 @ 4:25PM
అమరావతి. ఆంధ్రుల కలల రాజధాని. చంద్రబాబు కాంక్షించిన సుందర స్వప్నం. జగన్ వచ్చాక అమరావతి ఆగమాగం. రాజధానిని మూడుముక్కలు చేశారు. గతమెంతో ఘనమైన అమరావతిని మూలనపడేశారు. పేరుకే ఇప్పుడు అది ఏపీ కేపిటల్. ప్రస్తుతం అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చంద్రబాబు మీద జగన్‌కు ఉన్న కోపం అమరావతికి శాపంగా మారింది. అందుకే, అలనాటి అమరావతి ఆనవాళ్లను పరాయి దేశం భద్రంగా కాపాడుతుంటే.. ఇలనాటి జగన్‌రెడ్డి ప్రభుత్వం అమరావతిని నామరూపాలు లేకుండా చేసే కుతంత్రం చేస్తోందని మండిపడుతున్నారు.
అమరావతి కేవలం చంద్రబాబు పెట్టిన పేరు మాత్రమే కాదు. అది పురాతన కాలం నుంచీ ఉన్న ప్రముఖ నగరం. ఆ ప్రాంత చారిత్రక వైభవం.. అమరావతి పేరుకున్న ప్రాముఖ్యం గుర్తించే చంద్రబాబు అమరావతిని ఏపీ రాజధాని చేశారు. అందుకోసం ప్రాచీన చరిత్రను తవ్విపోశారు. అమరావతి అన్వేషణలో బ్రిటన్ మ్యూజియంలో భద్రంగా దాగున్న ఆనవాళ్లు ఆవిష్కృతమయ్యాయి.
అమరావతి చంద్రబాబు కాలం నాటిది కాదు. వేల ఏళ్ల ప్రాచీన చరిత్ర ఆ నేల సొంతం. బౌద్ధ మతం విరాజిల్లిన ప్రాంతం. అలనాటి శిల్పాలు, శాసనాలు బ్రిటీషర్ల కాలంలో బయటపడ్డాయి. ఆ అపురూప కళాఖండాలను అలాగే లండన్ తరలించారు. 120కి పైగా మార్బుల్ రాయితో తయారుచేసిన కళాఖండాలను, శాసనాలను భద్రంగా లండన్ మ్యూజియంలో ఉంచారు. ఆ అమరావతి ఆనవాళ్లు.. ఇప్పటికీ అక్కడి మ్యూజియంలో చూడొచ్చు. వాటిని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు సర్వే ఆఫ్ ఇండియా, యునెస్కో ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం అమరావతిని ఏలుతున్న జగన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైనా ప్రయత్నాలు చేస్తారా? ఉన్న అమరావతినే ఆనవాళ్లు లేకుండా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం నుంచి.. ఇక గత ఆనవాళ్లను ఆంధ్రుల చెంతకు తీసుకొచ్చే ప్రయత్నాలను ఆశించగలమా? అంటున్నారు.