భర్త కాదు బద్మాష్.. భార్యకు టార్చర్.. ఇంతకీ ఏం చేశాడంటే..
posted on Oct 29, 2021 @ 2:24PM
వాడో వెదవ. భర్త ముసుగులో ఉన్న బద్మాష్. శాడిస్ట్. సైకో. ఉన్మాది. ఎంత తిట్టినా తక్కువే. భార్యను కులం పేరుతో తిట్టేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. బట్టలు విప్పించేవాడు. యూరిన్ తాగాలని టార్చర్ చేసేవాడు. ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించాడు. ఇక చాలంటూ.. ఇక భరించలేనంటూ.. ఎట్టకేళకు ఆ భార్య ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ కేసు సంచలనంగా మారింది.
తనను కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొడుతూ అర్ధ నగ్నంగా ఉండమంటాడని, మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని ఆ మహిళ తన భర్త ఆగడాలపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అతని కుటుంబ సభ్యులూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.
నారాయణపేట మక్తల్‌కు చెందిన మహిళ రహమత్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఆమెకు 2016లో ఓ యువకుడితో ప్రేమ వివాహమైంది. గర్భం దాల్చినా గర్భస్రావం చేయించారు. భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను కులం పేరుతో దూషించేవారు. పలుమార్లు పెట్రోల్ పోసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవారు. అదనపు కట్నం తేవాలంటూ పదే పదే వేధించేవారు. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని బలవంతం చేసేవాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ భార్య. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు.