బాబు సభలో వైసీపీ కార్యకర్త.. జగన్ కు బిగ్ షాక్.. ఉమ్మడి సీఎంగా కేసీఆర్.. టాప్ న్యూస్@7PM
posted on Oct 29, 2021 @ 7:40PM
టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజక వర్గమైన కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చంద్రబాబు చెల్లిస్తామన్నారు.
---
అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. పాదయాత్ర అనుమతి కోసం లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది
--------
నుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చాడని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జి. వి.ఆంజనేయులు చెప్పారు. జగన్ ఇచ్చిన లైసెన్సుతో బొల్లా దోపిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా ఇళ్ల స్దలాల పేరుతో కోట్లు దోచుకున్నాడన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలకు ఎకరాకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు
--------
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. రాజోలు మండలంలోని తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేయించారు. అధికారులు రెండురోజుల పాటు స్కూలుకి సెలవులను ప్రకచించారు.
--------
శ్రీనివాససేతు నిర్మాణ పనులపై కార్పొరేషన్ కమిషనర్ గిరీషా, నిర్మాణ సంస్థతో సమీక్ష టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. నవంబర్ మాసం లోపల పనులు పూర్తి చెయ్యాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. టీటీడీ తరుపున చెల్లించాల్సిన నిధులను కూడా త్వరలోనే మంజూరు చెయ్యాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ చేత నవంబరులో శ్రీనివాస సేతును ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు.
--------
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళ్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తప్పుబట్టారు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు.జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.
--------
సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలని విమర్శించారు. వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్‌కు రెడీ.... నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు.
--------
రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలో కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు. డబ్బుల కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఓటు కోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని శశాంక్ తెలిపారు.
---
వరి విత్తనాలు అమ్మకూడదన్న సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. వరి విత్తనాలు అమ్మకూడదంటూ జారీ చేసిన ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని బాతుల నారాయణ పిటిషన్‌లో పేర్కొన్నారు.
-------
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతిచెందడపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రజలు విశేషాభిమానాన్ని చూరగొనిన ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్‌కుమార్ అని, అలాంటి పునీత్‌ను విధి మన నుంచి దూరం చేయడం బాధాకరమని ఓ ట్వీట్‌లో సంతాపం తెలిపారు. చాలా చిన్న వయస్సులోనే ఆయన కాలం చేసినప్పటికీ, ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోతుందని తెలిపారు.